telanagana
గంజాయి మత్తులో పట్టుబడిన ముగ్గురు యువకులు
సూర్య, వీణవంక:వీణవంక మండలం ఘన్ముకుల గ్రామ శివారులో గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు శనివారం పట్టుకున్నారు. వీణవంక ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం... ఉదయం పోలీస్ సిబ్బంది ప్రభుత్వ వాహనంలో ఘన్ముకుల శివారు ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను గమనించి పారిపోయేందుకు యత్నించిన వారిని సిబ్బంది వెంబడించి అదుపులోకి తీసుకున్నారు.పట్టుబడిన వారిని విచారించగా వారు ఘన్ముకుల గ్రామానికే చెందిన గజుల సన్నీ (21), కనుకుంట్ల రుత్విక్ (20), గజుల సిద్ధార్థ (19)గా గుర్తించారు. తాము గంజాయి సేవించినట్లు వారు పోలీసుల విచారణలో అంగీకరించారు. దీంతో పోలీసుల సమక్షంలో వారికి యూరిన్, డ్రగ్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించగా టీహెచ్సీ తీసుకున్నట్లు పాజిటివ్ ఫలితాలు నిర్ధారణ అయ్యాయి.వెంటనే పట్టుబడిన ప్రాంతంలో పంచనామా నిర్వహించిన పోలీసులు, యువకులకు సంబంధిత వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం వారిని గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. యువకుల ప్రవర్తనలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి వారిని డీ-అడిక్షన్ (వ్యసన విముక్తి) సెంటర్కు తరలించినట్లు ఎస్ఐ తిరుపతి వెల్లడించారు.