ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ
ఘనంగా నేరేడుచర్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం
చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ
భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామాల కార్యకర్తలు, సర్పంచులు
పూల బొకేలు, గజమాలతో చైర్‌పర్సన్‌కు ఘన సన్మానం
నేరేడుచర్ల, మేజర్ న్యూస్
నేరేడుచర్ల, పాలకవీడు రెండు మండలాలకు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం నేరేడుచర్ల మార్కెట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్, వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటు 17 మంది తో కూడిన కూడిన పాలకవర్గం లో డైరెక్టర్లు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్‌రెడ్డి సభాధ్యక్షత వహించారు. రెండు మండలాల్లోని వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, సర్పంచులు, పార్టీ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో మార్కెట్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది.
పూల బొకేలు, గజమాలతో ఘన సన్మానం
ప్రమాణ స్వీకారం అనంతరం నూతన చైర్పర్సన్ రంగినేని స్పందన రాజీవ్‌ను పలువురు నాయకులు, కార్యకర్తలు పూల బొకేలు అందించి ఘనంగా సత్కరించారు. రాజీవ్ యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చైర్పర్సన్ స్పందన రాజీవ్‌కు గజమాల వేసి ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నూతన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు.
ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం: స్పందన రాజీవ్
మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రంగినేని స్పందన రాజీవ్ మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో తనకు ఈ పదవి లభించిందని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. తాము అమెరికా నుంచి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చామని, మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. తాము రాజకీయ కుటుంబం నుంచి వచ్చినవారమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తూ రైతులకు మేలు జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.
రెండు మండలాల నాయకుల సమన్వయంతో పాలకవర్గం
నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రెండు మండలాల నాయకుల సమన్వయంతో మార్కెట్ కమిటీ పాలకవర్గం ఎంపిక జరిగిందని తెలిపారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన స్పందన రాజీవ్‌తో పాటు నూతన పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. నేరేడుచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ప్రత్యేక చరిత్ర ఉందని పేర్కొన్న ఆయన, తాను 2006లో 35 ఏళ్ల వయసులో చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం స్పందన రాజీవ్ కూడా 35 ఏళ్ల వయసులోనే ఈ బాధ్యతలు చేపట్టడం విశేషమన్నారు. చిన్న వయసులోనే కీలక బాధ్యతలు చేపట్టడం అదృష్టమని పేర్కొన్నారు.
సహకార సంఘాల అభివృద్ధికి ప్రాధాన్యం
ఉమ్మడి మండలంలో నాలుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) ఉన్నాయని కొణతం వెంకట్‌రెడ్డి తెలిపారు. చెల్లేపల్లి పీఏసీఎస్ చైర్మన్‌గా కట్టా రామారావు ఎన్నికైనట్లు వెల్లడించారు. మిగిలిన మూడు సహకార సంఘాల చైర్మన్ పదవులకు కూడా నియామక ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు తెలిపారు.
ప్రముఖుల హాజరు
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ సన్నీ నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల సందీప్‌రెడ్డి, పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దొంగరి వెంకటేశ్వర్లు, హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణ్‌కుమార్, పాలకవీడు కాంగ్రెస్ అధ్యక్షుడు సుబ్బారావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సాముల శివారెడ్డి, పాలకవీడు మాజీ జడ్పీటీసీ మోతిలాల్ నాయక్, మాజీ ఎంపీపీ గోపాల్ నాయక్, గరిడేపల్లి మాజీ ఎంపీపీ పెండెం శ్రీనివాసుగౌడ్తో పాటు రెండు మండలాల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రాజీవ్ యూత్ సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.