గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపిన ఎస్పీ
నారాయణపేట, సూర్య న్యూస్:
నారాయణపేట జిల్లాలో గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించడంపై జిల్లా గణేష్ ఉత్సవ కమిటీ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు జిల్లా ఎస్పీ డాక్టర్ జి. వినీత్ ని శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ సమర్థవంతంగా చేపట్టిన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జన మార్గాల్లో చేసిన ముందస్తు ఏర్పాట్లు, వివిధ ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది అందించిన సహకారాన్ని నాయకులు అభినందించారు. జిల్లాలో గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తికావడానికి పోలీస్ శాఖ తీసుకున్న చర్యలను ప్రశంసిస్తూ జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కు శాలువా కప్పి సత్కరించి, మెమెంటో అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా నిర్వహించడంలో గణేష్ ఉత్సవ కమిటీ, మండపాల నిర్వాహకులు, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు, ప్రజాప్రతినిధులు, హిందూ–ముస్లిం శాంతి కమిటీ సభ్యులు, మత పెద్దలు మరియు జిల్లా ప్రజలు అందించిన సహకారం ఎంతో కీలకమని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ సూచించిన నిబంధనలను పాటిస్తూ, పోలీసులకు పూర్తి సహకారం అందించిన మండపాల నిర్వాహకులకు ఎస్పీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో వ్యవహరించడం వల్లే పెద్ద ఎత్తున జరిగిన గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని పేర్కొన్నారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు ప్రజల సహకారం ఎల్లప్పుడూ అవసరమని, ఇదే విధమైన సహకారం భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఎస్పీ కోరారు. జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు పరస్పర గౌరవం, సహనం, సోదరభావంతో పండుగలను జరుపుకోవడం అభినందనీయమని, నారాయణపేట జిల్లా శాంతి, సామరస్యానికి ప్రతీకగా నిలవాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ లు మహేష్, నల్లపు లింగయ్య, జిల్లా గణేష్ ఉత్సవ కమిటీ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.
-- *రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.*