ఏసీబీ వలలో.. DMHO డా. స్వర్ణకుమారి
- డ్రైవర్ ద్వారా రూ లక్ష లంచం స్వీకరణ - ఫిజియోథెరపీ సెంటర్ కేసులో డీల్ - - -ముగ్గురు నిందితులు రిమాండ్
రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి కేసు సంచలనం రేపింది. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి స్వర్ణ కుమారి, హెల్త్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సూచనలతో వారి డ్రైవర్ మద్దూరి కృష్ణయ్య లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఎల్బీనగర్ లోని ఫిజియోథెరపీ సెంటర్ను లైసెన్స్ లేకుండా నడుపుతున్న కేసులో సీజ్ చేసిన కేంద్రానికి సంబంధించిన తాళాలు తిరిగి ఇవ్వడం, తదుపరి చర్యలు నిలిపివేయడం, అలాగే కొత్త లైసెన్స్ మంజూరు చేయడం కోసం ముందుగా రూ.5 లక్షలు డిమాండ్ చేయగా అతను అంత ఇచ్చుకోలేనని తెలపగా చివరకు రూ.2 లక్షలు డిమాండ్ చేసి, రూ.1 లక్ష తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డ్రైవర్ వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు, ఈ వ్యవహారంలో ఉన్న డీఎంహెచ్ఎ, హెల్త్ ఇన్స్పెక్టర్ పాత్రపై కూడా కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరచగా, కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. లంచం డిమాండ్ చేసే ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదు చేయడానికి 1064 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని ఏసీబీ అధికారులు సూచించారు.
వడ్ల శ్రీనివాస చారి : రంగారెడ్డి - మేజర్ న్యూస్