ఏసీబీ వలలో అవినీతి అధికారులు.!
- రూ.75 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ అధికారి, సీనియర్ అసిస్టెంట్
మొయినాబాద్ మున్సిపాలిటీలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి (AO-1), సీనియర్ అసిస్టెంట్ యేలమోని సుదర్శన్ (AO-2) లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం… ఓ ఫిర్యాదుదారుడి నిర్మాణాన్ని అక్రమ నిర్మాణంగా పరిగణించి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ.75,000 లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ మొత్తాన్ని AO-2 సుదర్శన్ ద్వారా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
సుదర్శన్ వద్ద నుంచి రూ.75,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది. విధులను సక్రమంగా నిర్వహించకుండా అనుచిత ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఆరోపిస్తూ ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. అనంతరం ఇద్దరినీ నాంపల్లి ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏసీబీ విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో పేర్కొంది. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా వెల్లడించలేదని అధికారులు తెలిపారు.
- భాస్కర్ : మేజర్ న్యూస్ మొయినాబాద్.