telanagana
ఎస్ఐఆర్–2026 ప్రక్రియను వేగవంతం చేయాలి • జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య
సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 లో భాగంగా మ్యాపింగ్ కాని, అనమలిస్ ఓటర్ల నుండి ధ్రువపత్రాల స్వీకరణ, పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. మంగళవారం జిల్లాలోని కాసిపేట మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఎస్ ఐ ఆర్ ప్రక్రియ నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ 2026 హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎన్నికల సంబంధిత పనులలో ఎలాంటి జాప్యం జరగకుండా బూత్ స్థాయి అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్దేశిత లక్ష్యాలను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని తెలిపారు. మండలంలోని దేవాపూర్ గ్రామపంచాయతీని సందర్శించి గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, పంచాయతీ రికార్డులు, ఇతర పరిపాలనా అంశాలను పరిశీలించారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచడంతో పాటు, గ్రామపంచాయతీ పరిధిలోని రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎస్ఐఆర్ - 2026 ప్రక్రియలో భాగంగా బిఎల్ఓలు సేకరించిన ఎస్ఐఆర్ ఫారాలను క్షుణ్ణంగా ధ్రువీకరించి, సంబంధిత వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న ఫారాల పరిశీలన, ఆన్లైన్ నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. విధులలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని తెలిపారు. ఈ-పంచాయతీ పోర్టల్ ద్వారా నిరుద్యోగ యువత నమోదు కోసం అందిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం ధ్రువీకరించి, అర్హులైన వారికి సంబంధిత సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పన్నుల వసూళ్లను లక్ష్యాలకు అనుగుణంగా చేపట్టాలని, పంచాయతీ ఆదాయ వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ, గ్రామ అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల సమీకరణపై దృష్టి సారించాలని తెలిపారు. పశు వైద్యశాల సందర్శించి అందిస్తున్న సేవలను పరిశీలించారు. పశుపోషకులకు అవసరమైన పశువైద్య సేవలు సకాలంలో అందేలా చూడాలని సిబ్బందికి సూచించారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న వి.ఓ. నూతన భవనాలను పరిశీలించి, నిర్మాణ పనులలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులను పూర్తి చేయాలని తెలిపారు. ఈ పర్యటనలో మండల తహసిల్దార్ సునీల్ పాండే, దేవాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ సిడాం రాందాస్, గ్రామ పంచాయతీ అధికారులు, బూత్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.