డ్రిప్ ద్వారా ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన
ఫర్టిగేషన్ పద్ధతితో నీరు, ఎరువుల ఆదా – పంట దిగుబడి పెంపునకు అవకాశం
శంకర్పల్లి: డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిలో కరిగే ఎరువులను మొక్కలకు నేరుగా అందించే విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. డ్రిప్ పరికరాల విక్రయానంతర సేవల్లో భాగంగా ఫినోలెక్స్ డ్రిప్ కంపెనీ ఆధ్వర్యంలో పర్వేద మండలం శంకర్పల్లి గ్రామానికి చెందిన రైతు సుదర్శన్ రెడ్డి పొలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రైతు సుదర్శన్ రెడ్డి తన పొలంలో ఆరు ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫినోలెక్స్ డ్రిప్ కంపెనీ ప్రతినిధులు నీటిలో కరిగే ఎరువులను డ్రిప్ వ్యవస్థ ద్వారా మొక్కలకు ఏ విధంగా అందించాలో రైతులకు క్షేత్రస్థాయిలో వివరించారు. ఎరువులను నీటిలో కలిపి డ్రిప్ వ్యవస్థ ద్వారా పంటకు అందించే ఫర్టిగేషన్ పద్ధతిని ప్రాక్టికల్గా ప్రదర్శించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, డ్రిప్ ద్వారా ఎరువులను అందించడం వల్ల మొక్కల వేర్లకు నేరుగా పోషకాలు చేరుతాయని, నీరు, ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. తద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పంట దిగుబడిని పెంచుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి వనరుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రభుత్వం అందిస్తున్న డ్రిప్ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ మెరుగైన పంట దిగుబడులు సాధించేందుకు ఫర్టిగేషన్ పద్ధతిని అవలంబించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల మండల ఇన్చార్జి ఉద్యాన అధికారి కె. ఐశ్వర్య (HO), సౌజన్య (MIE), ఎం. నర్సింహులు (HEO), ఫినోలెక్స్ కంపెనీ ప్రతినిధి ప్రదీప్ (DCO)తో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.
(శంకర్పల్లి,మేజర్ న్యూస్)