అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నాయకుడిపై ఆరోపణలు
సూర్య, చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ఓ దళితుడు ఇందిరమ్మ ఇల్లు మంజూరు విషయమై కాంగ్రెస్ నాయకుడు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతపంటి రామస్వామిని సంప్రదించగా వివాదం చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. తనను రామస్వామి దూషించడమే కాకుండా దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.ఈ ఘటనకు సంబంధించిన సంభాషణను బాధితుడు వాయిస్ రికార్డు చేసి గ్రామంలోని పలువురికి వినిపించడంతో విషయం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపారు.
ఈ ఘటనపై దళిత సంఘాల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు గ్రామం నుంచి బైక్ ర్యాలీగా చందుర్తి పోలీస్ స్టేషన్‌కు తరలివెళ్లి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది.