భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ సలీమా టెటెకు సౌత్ ఈస్టర్న్ రైల్వే ఘన సన్మానం: మరో ఇద్దరు స్టార్ ప్లేయర్లకూ ప్రత్యేక పురస్కారం!
సూర్య క్రీడా డెస్క్: భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ సలీమా టెటెతో పాటు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మరో ఇద్దరు స్టార్ ప్లేయర్లు నిక్కీ ప్రధాన్, దీపికా సొరెంగ్‌లను సౌత్ ఈస్టర్న్ రైల్వే (SER) ఘనంగా సత్కరించింది. కోల్‌కతాలోని రైల్వే ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక అభినందన సభలో సౌత్ ఈస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ జైన్ వారికి శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందజేసి అభినందించారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఈ ముగ్గురు క్రీడాకారిణులు సౌత్ ఈస్టర్న్ రైల్వే ఉద్యోగులుగా సేవలందిస్తూనే అంతర్జాతీయ వేదికలపై దేశానికి ఘనమైన విజయాలను అందిస్తున్నారు.
అంతర్జాతీయ పోటీల్లో భారత జట్టును ముందుండి నడిపించడంలో కెప్టెన్ సలీమా టెటె కీలక పాత్ర పోషించారని జీఎం అనిల్ కుమార్ జైన్ కొనియాడారు. నిక్కీ ప్రధాన్, దీపికా సొరెంగ్ తమ అత్యుత్తమ ఆటతీరుతో జట్టు విజయాల్లో సమష్టిగా భాగస్వామ్యమయ్యారని ప్రశంసించారు. ఈ అథ్లెట్ల కఠోర శ్రమ, అంకితభావం మరియు క్రీడా ప్రతిభ మొత్తం రైల్వే కుటుంబానికే కాకుండా యావత్ భారతదేశానికీ గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. దేశంలో మహిళా క్రీడాకారుల అభివృద్ధికి, వారి నైపుణ్యాలను ప్రోత్సహించడానికి భారతీయ రైల్వే నిరంతరం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కెప్టెన్ సలీమా టెటె మాట్లాడుతూ.. తమ క్రీడా ప్రయాణంలో సౌత్ ఈస్టర్న్ రైల్వే అందిస్తున్న నిరంతర ప్రోత్సాహం ఎంతో గొప్పదని కృతజ్ఞతలు తెలిపారు. ఒక సాధారణ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడంలో రైల్వే ఇచ్చిన మద్దతు మరువలేనిదని పేర్కొన్నారు. భవిష్యత్‌లో జరగబోయే కీలక టోర్నమెంట్లు, ఒలింపిక్స్ పోటీల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి దేశానికి మరిన్ని పతకాలు తీసుకురావడమే తమ లక్ష్యమని క్రీడాకారిణులు ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పలువురు రైల్వే ఉన్నతాధికారులు, క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు.