ఉచిత మల్టీమీడియా న్యూస్ ఫీడ్‌గా ప్రాచుర్యం పొందుతున్న ప్రసార భారతి 'పిబిశబ్ద'
సూర్య జాతీయ డెస్క్: ప్రసార భారతికి చెందిన ప్రసార భారతి షేర్డ్ ఆడియో-విజువల్స్ ఫర్ బ్రాడ్‌కాస్ట్ అండ్ డిస్సెమినేషన్ (PBSHABD) వేదిక దేశీయ సమాచార రంగానికి ఉచిత మల్టీమీడియా న్యూస్ ఫీడ్‌గా సేవలు అందిస్తోంది. కేంద్ర సమాచార ప్రసార శాఖ 2024 మార్చి 13న ప్రారంభించిన ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా నమోదిత ప్రింట్, టీవీ మరియు డిజిటల్ మీడియా సంస్థలకు ఉచితంగా వార్తలను అందిస్తున్నారు. మొత్తం 15 ప్రధాన భారతీయ భాషలలో టెక్స్ట్, వీడియో, ఆడియో, ఫొటోలు మరియు ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో సమాచారాన్ని సిద్ధం చేసి ప్రసార భారతి అందిస్తోంది. ప్రారంభమైన రెండేళ్లలోనే దేశవ్యాప్తంగా 3,600కి పైగా మీడియా సంస్థలు ఇందులో సభ్యత్వం పొందాయి.
దేశంలోని జాతీయ, ప్రాంతీయ మరియు జిల్లా స్థాయి పరిణామాలను ప్రతిబింబించేలా దాదాపు 50 విభిన్న కేటగిరీలలో ఈ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉన్నాయి. మీడియా సంస్థల ప్రతినిధులు ఉచితంగా ఈ వార్తా కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ప్రసార భారతి మార్చి 2027 వరకు గడువును పొడిగించింది. ఈ ప్లాట్‌ఫామ్ అందిస్తున్న ప్రధాన ప్రయోజనం ఏంటంటే, ఈ వార్తలపై ఎలాంటి వాటర్‌మార్క్ లేదా లోగోలు ఉండవు. చిన్న మరియు ప్రాంతీయ పత్రికలు కూడా ఎటువంటి రొయాల్టీ చెల్లించకుండా తమ సొంత పేరు మీద ఈ వార్తలను ప్రచురించుకునే వెసులుబాటును ఇది కల్పిస్తోంది.
ఈ విస్తృత వ్యవస్థ వెనుక ప్రసార భారతికి చెందిన భారీ నెట్‌వర్క్ పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా 1,500 మందికి పైగా రిపోర్టర్లు, కరస్పాండెంట్లు సేకరించే సమాచారాన్ని 60 డెస్క్‌లు నిరంతరం పరిశీలించి ధృవీకరిస్తాయి. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్‌వర్క్‌ల ద్వారా 92 భాషలు మరియు మాండలికాల్లో రోజువారీ బులెటిన్లు వెలువడుతున్నాయి. సోషల్ మీడియా మరియు డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారానికి చెక్ పెడుతూ, క్షేత్రస్థాయి నుంచి వచ్చిన వార్తలను కచ్చితమైన తనిఖీల తర్వాతనే పిబిశబ్ద ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. భవిష్యత్తులో మరింత సాంకేతిక మార్పులతో పిబిశబ్ద 2.0 వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రసార భారతి ఏర్పాట్లు చేస్తోంది.