పూచీకత్తు బాండ్‌పై దిప్కే సహా ముగ్గురి విడుదలలో సంబరపడాల్సింది ఏమీ లేదు: ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఎద్దేవా!
సూర్య జాతీయ & రాజకీయ డెస్క్: నిరసనల నేపథ్యంలో ముందస్తు నిర్బంధానికి గురై, అనంతరం బాండ్‌పై విడుదలైన సీజేపీ నాయకుల విడుదలను ఘన విజయంగా చిత్రీకరించడాన్ని ఢిల్లీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా ఆక్షేపించింది. కోర్టులో పూచీకత్తు బాండ్ సమర్పించి బయటకు రావడంలో సంబరాలు చేసుకోవడానికి ఏమీ లేదని ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ తేల్చిచెప్పారు.
సీజేపీ (CJP) నేతలు అభిజిత్ దిప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని ఒక్కొక్కరు రూ.50,000 పూచీకత్తు బాండ్ సమర్పించిన తర్వాతే కోర్టు విడుదల చేసిందని బీజేపీ గుర్తుచేసింది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కమ్యూనిస్టు పార్టీలు మరియు సీజేపీ వర్గాలు దీనిని ఏదో ఒక పెద్ద న్యాయపోరాట విజయంగా తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాయని బీజేపీ విమర్శించింది.
చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించకుండా ఏడాది పాటు శాంతియుతంగా ఉంటామని హామీ ఇస్తూ బెయిల్ బాండ్ రాసిచ్చి విడుదల కావడమనేది సాధారణ చట్టపరమైన ప్రక్రియేనని, నిబంధనలను ఉల్లంఘిస్తే మళ్లీ చర్యలు తప్పవని బీజేపీ స్పష్టం చేసింది. ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా చట్టవ్యతిరేక నిరసనలకు దిగితే ఉపేక్షించేది లేదని, ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలను మానుకోవాలని నాయకులు హితవు పలికారు.