నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యం
భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన బియ్యాన్ని అందించడమే లక్ష్యమని ముల్కనూర్ సహకార సంఘం అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ఆదివారం ముల్కనూర్ సహకార సంఘం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా రైతులకు పురుగుమందుల అవశేషాల నియంత్రణ, సురక్షిత సస్యరక్షణ పద్ధతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వరి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వై. చంద్ర మోహన్ మాట్లాడుతూ.. పురుగుమందులను శాస్త్రీయ పద్ధతిలో వినియోగించాలని, పంట కోతకు ముందు నిర్దేశిత నిరీక్షణ కాలాన్ని పాటించాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పంట సాగు చేస్తే ఎగుమతి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే సంఘం లక్ష్యమన్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన పంటలు పండించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం జనరల్ మేనేజర్ ఎం. రాంరెడ్డి, ఏజీఎం సతీష్, వ్యవసాయ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
రిపోర్టర్, రామకృష్ణ, భీమదేవరపల్లి, హనుమకొండ జిల్లా