యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం
సూర్య అంతర్జాతీయ డెస్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారత్ విస్తరణకు, శాశ్వత సభ్యత్వ స్థానానికి రష్యా తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సాధారణ మహాసభలో ప్రసంగించిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ కీలక ప్రకటన చేశారు. భద్రతా మండలి పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆసియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా ఖండాలలోని దేశాలకు ప్రాతినిధ్యం పెంచాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. భారత్‌తో పాటు బ్రెజిల్ దేశానికి కూడా శాశ్వత సభ్యత్వం కల్పించాలనే ప్రతిపాదనను రష్యా బలంగా సమర్థిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా పాశ్చాత్య దేశాలపై రష్యా విదేశాంగ మంత్రి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భద్రతా మండలి సంస్కరణల ప్రక్రియలో పాశ్చాత్య దేశాలకు, ముఖ్యంగా జర్మనీ మరియు జపాన్ వంటి దేశాలకు అదనపు స్థానాలు కేటాయించడాన్ని రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తేల్చి చెప్పారు. సైనికవాదం, పునరుద్ధరణ విధానాల వైపు పయనిస్తున్న ఇటువంటి దేశాలకు చోటు ఇవ్వడం తమ సూత్రప్రాయ విధానానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న ఖండాల ప్రయోజనాలను కాపాడటంతో పాటు ఆఫ్రికా ఖండానికి కూడా తగిన ప్రాతినిధ్యం మరియు న్యాయం జరగాలని ఆయన ఉద్ఘాటించారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను బాగు చేయడానికి రష్యా తన మిత్రదేశాలు మరియు వ్యూహాత్మక భాగస్వాములైన బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ మరియు యురేషియన్ ఎకనామిక్ యూనియన్‌లతో కలిసి పనిచేస్తోందని లావ్రోవ్ వెల్లడించారు. అందరినీ ఏకం చేసే సమగ్రమైన ఆలోచనలు, ప్రాజెక్టులను తాము ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ సమాచార భద్రత వంటి కీలక అంశాలపై చర్చలు జరపడానికి ఏకపక్ష వేదికల కంటే ఐక్యరాజ్యసమితి మాత్రమే కేంద్ర బిందువుగా ఉండాలని, ప్రపంచ దేశాలన్నీ ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.