అగ్రరాజ్యాల మధ్య శాంతి యత్నాలు భగ్నం
డిప్లొమసీయే దిక్కన్న ఇరాన్
సూర్య అంతర్జాతీయ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్‌లతో సాగుతున్న సుదీర్ఘ పోరాటంలో దౌత్యపరమైన చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం సాధ్యమవుతుందని ఇరాన్ పునరుద్ఘాటించింది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం మరియు సైనిక చర్యలను నిలిపివేయడంపై ఇరాన్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తిరస్కరించిన నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడాలంటే ఇరాన్ విధించిన షరతులను అమెరికా ఆమోదించాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రస్తుత సంక్షోభం నుండి ఇరుదేశాలు బయటపడటానికి చర్చల మార్గం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదని సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.
గత వారం న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ మహాసభలో ఖతార్ మధ్యవర్తుల ద్వారా ఇరాన్ తన శాంతి ప్రతిపాదనను అమెరికాకు పంపింది. అయితే ఇరాన్ తీవ్ర ఓటమి అంచున ఉనందున హార్ముజ్ జలసంధిని తెరవడానికి ఆత్రుత చూపుతోందని, అందుకే ఈ ప్రణాళికను తాను తిరస్కరించానని ట్రంప్ శనివారం వైట్‌హౌస్‌లో ప్రకటించారు. అయినప్పటికీ, మధ్యవర్తుల నుండి తమకు ఎలాంటి అధికారిక తిరస్కరణ సమాచారం అందలేదని, వారి నుండి స్పష్టమైన స్పందన వచ్చాక తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఇరాన్ విదేశాంగ మంత్రి వెల్లడించారు. హార్ముజ్ జలసంధిలో ఓడలపై దాడులను అరికట్టేందుకు అమెరికా ఆర్థిక దిగ్బంధనం విధించడంతో ఈ వ్యూహాత్మక జలమార్గంలో నౌకాయానం గణనీయంగా మందగించింది.
ఏడు నెలలుగా కొనసాగుతున్న ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరాను దెబ్బతీయడంతో పాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపాయి. శాంతి ఒప్పందానికి అమెరికా సిద్ధపడితే ఏడు రోజుల వ్యవధిలో హార్ముజ్ జలసంధిని తెరచి ప్రాంతీయ పోరాటానికి విరామం ప్రకటిస్తామని ఇరాన్ ప్రతిపాదించింది. దీని ద్వారా ఇరాన్ అణు కార్యక్రమంతో సహా వివిధ అంశాలపై సమగ్ర చర్చలు జరిపేందుకు మార్గం సుగమమవుతుందని పేర్కొంది. అయితే తమ అణు సార్వభౌమత్వ హక్కులు, యురేనియం రవాణా విషయంలో ఎలాంటి సడలింపులు ఇచ్చేది లేదని ఇరాన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ దేశం యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అయితే ఎలాంటి బెదిరింపులు లేదా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. అణు ఆయుధాలను తయారు చేయకూడదనే ప్రాథమిక సూత్రానికి ఇరాన్ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ప్రారంభమైన ఈ యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, ఇరాన్ ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయింది. ప్రతికారంగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాలపై ఇరాన్, అలాగే సౌదీ అరేబియా లక్ష్యంగా యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు కొనసాగిస్తున్నారు.