ట్రినిడాడ్ లా విద్యార్థినికి ‘మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ 2026’ కిరీటం
సూర్య అంతర్జాతీయ డెస్క్: ప్రవాస భారతీయ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అందాల పోటీ ‘మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ 2026’ (33వ ఎడిషన్) కిరీటాన్ని ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన 19 ఏళ్ల భారత సంతతి లా విద్యార్థిని హేలీ పైసాదీ (Hailey Pysadee) కైవసం చేసుకుంది. ట్రినిడాడ్‌లోని నేషనల్ అకాడమీ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (NAPA) వేదికగా జరిగిన ఈ గ్రాండ్ ఫినాలేలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి పాల్గొన్న భారత సంతతి యువతులను వెనక్కి నెట్టి ఆమె విజేతగా నిలిచింది.
ఈ పోటీల్లో హేలీ పైసాదీ తన వాక్చాతుర్యం, సంస్కృతి, ఆత్మవిశ్వాసం మరియు విలక్షణ ప్రతిభతో న్యాయనిర్ణేతలను మెప్పించి విజేతగా అవతరించింది. స్వదేశంలోనే జరిగిన ఈ పోటీలో టైటిల్ గెలుచుకోవడం ద్వారా స్థానిక ప్రవాస భారతీయ సమాజానికి గర్వకారణంగా నిలిచింది. అమెరికాకు చెందిన ఇండియా ఫెస్టివల్ కమిటీ (IFC) ఆధ్వర్యంలో 1990 నుంచి నిర్వహిస్తున్న ఈ పోటీలు.. ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన ప్రవాస భారతీయులలోని ప్రతిభను, సాంస్కృతిక అనుసంధానాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాన వేదికగా నిలుస్తున్నాయి. ఈ పోటీల్లో మిగిలిన విభాగాల్లో కూడా వివిధ దేశాల నుంచి ప్రాతినిధ్యం వహించిన యువతులు తమ ప్రతిభను చాటుకున్నారు.