పెసరపప్పు లేక కందిపప్పు.. రోజూ ఏది తింటే ఆరోగ్యానికి మంచిది? పోషకాహార నిపుణులు ఏమంటున్నారంటే!
సూర్య లైఫ్‌స్టైల్ డెస్క్: తెలుగు వారి ప్రతి ఇంట్లోనూ రోజువారీ భోజనంలో పప్పు ప్రధానమైన ఆహారంగా ఉంటుంది. ముద్దపప్పు నుంచి సాంబార్, చారు వరకు అనేక రకాల వంటకాల్లో పప్పును విరివిగా ఉపయోగిస్తుంటారు. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలనుకునే వారు నిత్యం వినియోగించే పప్పుధాన్యాలలో ఏది మెరుగైనదనే చర్చ తరచుగా వస్తుంటుంది. ముఖ్యంగా అత్యధికంగా వాడే కందిపప్పు మరియు పెసరపప్పులో ఏది ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరమనే అంశంపై పోషకాహార నిపుణులు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. ఈ రెండు పప్పుల్లోనూ శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా లభిస్తున్నప్పటికీ, వాటి పనితీరు మరియు జీర్ణమయ్యే విధానంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మన దేశంలో అత్యధిక జనాభా నిత్యం కందిపప్పును తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. దీనిని తీసుకోవడం ద్వారా శరీరానికి తగినంత శక్తి లభిస్తుందని, కండరాల బలోపేతానికి ఇది ఎంతగానో సహకరిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారు లేదా కీళ్ల నొబ్బలు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు మాత్రం కందిపప్పు విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కందిపప్పులో ఉండే కొన్ని రసాయనిక పదార్థాల కారణంగా కొందరిలో అజీర్తి లేదా కడుపు ఉబ్బరం వంటి అసౌకర్యాలు కలిగే అవకాశం ఉందని, అందుకే మోతాదుకు మించి తీసుకోకుండా పరిమితంగా వాడటం మంచిదని సూచిస్తున్నారు.
మరోవైపు పెసరపప్పు ఆరోగ్యాకి చాలా తేలికైనదిగా మరియు సులభంగా జీర్ణమయ్యే పప్పుధాన్యంగా గుర్తింపు పొందింది. ఏవైనా అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటున్న వారికి లేదా తేలికపాటి ఆహారం తీసుకోవాలనుకునే వారికి పెసరపప్పు ఉత్తమ ఎంపికని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియంతో పాటు విటమిన్లు సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్‌లో పెసరపప్పును చేర్చుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఏ పప్పు ఎక్కువ ఆరోగ్యకరమనేది పూర్తిగా వ్యక్తిగత శరీర తత్త్వం, జీర్ణవ్యవస్థ మరియు ఆరోగ్య అవసరాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎవరికైనా ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు లేకపోతే ఈ రెండింటిని సమపాళ్లలో లేదా మార్చి మార్చి తమ రోజువారీ మెనూలో చేర్చుకోవడం వల్ల పూర్తి పోషకాలు అందుతాయని చెబుతున్నారు. ఏ పప్పునైనా సరైన పద్ధతిలో ఉడికించి, మితంగా తీసుకోవడం ద్వారా అవాంఛిత ఆరోగ్య సమస్యలను దూరం పెట్టడంతో పాటు శరీరానికి కావాల్సిన శక్తిని సులభంగా పొందవచ్చు.
Also Read: ఫ్రిజ్‌లో పెరుగు ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఈ విషయాలు తెలుసుకోకపోతే అనారోగ్యమే!