కష్టాల్లో ఉన్నప్పుడు ఆ స్టార్ హీరో ఇంట్లో భోజనం.. చిరంజీవిపై నాజర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రముఖ సీనియర్ నటుడు నాజర్ తన సినీ ప్రస్థానం, తొలినాళ్లలో ఎదుర్కొన్న కష్టాలను ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా పంచుకున్నారు. చెన్నైలో ఉద్యోగం చేస్తూనే అదనపు పనులు చేసుకుని, కొంచెం కొంచెం డబ్బు కూడబెట్టుకుని నటనలో శిక్షణ తీసుకున్న రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. సుమారు పదిహేనేళ్ల సుదీర్ఘ శ్రమ తర్వాత నటనా రంగంలోకి అడుగుపెట్టినప్పుడు ఎందరో స్నేహితులు, సహచరుల ఆదరణ తనకు అండగా నిలిచిందని తెలిపారు.
అవకాశాల కోసం పోరాడుతున్న రోజుల్లో తనకు ఆకలి వేసినప్పుడు చిరంజీవి ఇంట్లో భోజనం చేసిన సందర్భాన్ని నాజర్ సరదాగా వెల్లడించారు. అయితే ఈ విషయం చిరంజీవికి తెలియదని, ఆయన సతీమణి సురేఖకు మాత్రమే తెలుసని నవ్వుతూ చెప్పారు. చిరంజీవి షూటింగ్ సెట్స్‌లో ఉన్న సమయంలో తన స్నేహితుడి ద్వారా సురేఖకు ఫోన్ చేయించి భోజనం గురించి కనుక్కుని, ఆ తర్వాత వెళ్లి తిని వచ్చేవాడినని నాజర్ గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో తనను ఎవరూ చిన్నచూపు చూడలేదని, సినీ పరిశ్రమలోని ఆ సహృదయతను ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు.
తన తొలి తెలుగు సినిమా చంటి అనుభవాలను కూడా నాజర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అప్పటివరకు తనకు తెలుగు భాష రాదని, తెలుగు సినిమాలు కూడా చూడలేదని చెప్పారు. కోట శ్రీనివాసరావు వంటి దిగ్గజ నటుల మధ్య తనకు చిన్న పాత్ర దక్కినా, వెంకటేష్ హీరోగా నటించిన ఆ చిత్రంలో డైలాగుల అర్థం తెలుసుకునేందుకు వెంకటేష్‌ను అడిగినప్పుడు ఆయన ఎంతో ఓపికగా వివరించారని కృతజ్ఞతలు తెలిపారు.
కొత్త భాష నేర్చుకోవాలనే తపనతో ముందుకు సాగిన తనకు తెలుగు చిత్రసీమ ఎంతో ఆదరణ ఇచ్చిందని నాజర్ అన్నారు. సినీ ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ, అలాగే తనలోని ప్రతిభను వెలికితీసిన దర్శకులు, సహనటులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Also Read: మహిళల హార్మోన్ల సమతుల్యతకు అవసరమైన పోషకాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలివే!