విజయ్ దేవరకొండపై నెగెటివ్ ప్రచారం ఆపండి: నిర్మాత యలమంచిలి రవి సీరియస్ కామెంట్స్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ పీరియాడికల్ మూవీ రణబాలి. టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో బ్రిటీష్ కాలం నాటి చారిత్రాత్మక నేపథ్యంలో ఈ భారీ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన చిత్ర వేడుకలో ప్రముఖ నిర్మాత యలమంచిలి రవి మాట్లాడుతూ విజయ్ దేవరకొండపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాపై వస్తున్న అవాస్తవాలను, కావాలనే సృష్టించే నెగెటివిటీని ఇకనైనా ఆపాలని ఆయన గట్టిగా హితవు పలికారు.
విజయ్ దేవరకొండ చాలా మంచివాడని, ఆయనకు సినిమా తప్ప వేరే లోకం లేదని నిర్మాత రవి కొనియాడారు. తాను విజయ్‌తో దాదాపు ఏడేనిమిదేళ్లుగా ప్రయాణం చేస్తున్నానని, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో తనకు బాగా తెలుసని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో కావాలనే సోషల్ మీడియా వేదికగా విజయ్‌ని టార్గెట్ చేస్తూ కొందరు కావాలని నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సినిమా ట్రైలర్ కూడా రాకముందే నెగెటివ్ కామెంట్లు చేయడం సరికాదని, అసలు సినిమా చూడకుండానే ఎలా ఒక నిర్ణయానికి వస్తారని ఆయన ప్రశ్నించారు. కథ నచ్చకపోతే ఆ తర్వాత తమను, సినిమాను విమర్శించండి తప్పులేదని, కానీ ముందే ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
బ్రిటీష్ కాలం నాటి అరుదైన పాయింట్‌తో తెరకెక్కుతున్న ఈ రణబాలి సినిమా ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ అనుభూతిని పంచుతుందని నిర్మాత రవి ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని, భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక నిపుణుల సమక్షంలో ఈ సినిమాను నిర్మించామని తెలిపారు. సినిమాపై అనవసరమైన రూమర్స్ నమ్మకుండా ప్రేక్షకులు థియేటర్లలోకి వచ్చి సినిమాను చూసి ఆదరించాలని ఆయన కోరారు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16న రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ పూర్తి విశ్వాసంతో ఉంది.