ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలిత పాత్రలో త్రిష
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత సినీ నటుడు ఎంజీ రామచంద్రన్ జీవిత చరిత్ర ఆధారంగా ‘పురట్చితలైవర్ ఎంజీఆర్’ పేరుతో ఒక భారీ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో దివంగత జయలలిత పాత్ర కోసం ప్రముఖ నటి త్రిష కృష్ణన్‌ను సంప్రదిస్తున్నట్లు దర్శక నిర్మాత, నటుడు జేఎమ్ బషీర్ వెల్లడించారు. ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్రలో స్వయంగా జేఎమ్ బషీర్ నటించనుండగా, కీలకమైన జయలలిత పాత్రలో త్రిష నటిస్తే బాగుంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సినిమా ఎంజీఆర్ బాల్యం, సినీ ప్రస్థానం, రాజకీయ జీవితం వంటి అనేక ముఖ్య ఘట్టాల చుట్టూ తిరుగుతుంది. జయలలితతో ఆయనకున్న ప్రత్యేక అనుబంధం, రాజకీయ ప్రయాణం ఈ చిత్రంలో కీలక భాగం కానుంది. త్రిష ప్రస్తుతం బషీర్ కుమార్తెతో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారని, ఆమె ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై త్రిష వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ బయోపిక్‌లో అన్నాదురై, కరుణానిధి వంటి ఇతర ప్రముఖ నాయకుల పాత్రలు కూడా ఉండనున్నాయి. చెన్నైలోని రామపురంలో ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఒకవేళ త్రిష ఈ ప్రాజెక్ట్‌కు అంగీకరిస్తే, ఆమె నటనా జీవితంలో జయలలిత పాత్ర ఒక మైలురాయిగా నిలిచిపోతుందని తమిళ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.