రీల్స్‌తో జీవితం బాగుపడదు.. మరోసారి పెద్ద మనసు చాటుకున్న హీరో సూర్య
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: సోషల్ మీడియా మోజులో పడి విద్యార్థులు తమ అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకోవద్దని కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హితవు పలికారు. కేవలం రీల్స్ చేయడం వల్ల జీవితంలో ఎప్పటికీ స్థిరపడలేరని, ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే చదువే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు. నటుడు శివకుమార్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ 47వ వార్షికోత్సవ వేడుకలు చెన్నైలోని టీ.నగర్‌లోని అగరం ఫౌండేషన్ కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ప్లస్ టూ పూర్తి చేసి కాలేజీల్లో అడుగుపెట్టిన 25 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు సూర్య ఆర్థిక సాయం అందించి తన గొప్ప మనసును చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి హీరో సూర్య మాట్లాడుతూ సినిమాల్లో సరిగా నటించకపోతే దర్శకుడు రీటేక్ చెబుతారని, కానీ నిజ జీవితంలో ఎవరికీ అలాంటి రీటేక్‌లు ఉండవని సూచించారు. జీవితంలో ఒక్కసారి అవకాశం కోల్పోతే మళ్లీ వెనక్కి రాలేమని, కాబట్టి ప్రతి క్షణాన్ని చదువు కోసమే కేటాయించాలని పిలుపునిచ్చారు. చదువుల్లో ఒడిదుడుకులు ఎదురైనపుడల్లా తమను తాము వన్స్ మోర్ అంటూ ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థుల చదువుల నిమిత్తం మరియు పలు విద్యా సంస్థల ద్వారా మొత్తం రూ. 13.78 లక్షల మేరకు భారీ ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ఇదే వేదికపై సీనియర్ నటుడు శివకుమార్ మాట్లాడుతూ తమ కుటుంబం ద్వారా పేద విద్యార్థులకు అందిస్తున్న సహాయ సహకారాల ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. 1979లో తాను నటించిన వందో చిత్రం రోసాప్పూ రవి కైక్కారి సినిమాకు వచ్చిన రూ. 25 వేల పారితోషికాన్ని బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, ఆ వడ్డీ ద్వారా వచ్చే మొత్తంతో పేద విద్యార్థులను ఆదుకోవడం ప్రారంభించామని తెలిపారు. ఆరంభంలో చిన్నపాటి బహుమతులు ఇచ్చేవాళ్లమని, ఆ తర్వాత తన సొంత నిధుల నుంచి ఉపకారవేతనాలు అందజేస్తూ వచ్చామని పేర్కొన్నారు. కాలక్రమేణా 2006 నుంచి అగరం ఫౌండేషన్ ఈ సత్కార్య బాధ్యతలను తన భుజాన వేసుకుని ప్రతి ఏటా ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు, ఆర్థిక సాయం అందిస్తోందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ప్రముఖ చిత్రకారుడు జీవానందన్‌కు కూడా రూ. లక్ష ఆర్థిక సాయం అందజేసి ఆదుకున్నారు. పేదరికంలో మగ్గుతున్న ప్రతిభావంతులకు విద్యను అందించడమే లక్ష్యంగా అగరం ఫౌండేషన్ చేస్తున్న సేవలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. సినిమా రంగంలో బిజీగా ఉన్నప్పటికీ సామాజిక బాధ్యతను విస్మరించకుండా నిత్యం విద్య, సేవా కార్యక్రమాలలో సూర్య కుటుంబం ముందుండటాన్ని పలువురు ప్రముఖులు, అభిమానులు అభినందిస్తున్నారు.
Also Read: జిమ్ జిమ్ తార సాంగ్ క్రేజ్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న పర్ణశాల ఫుల్ లిరికల్ వీడియో