ఎవోస్ కొనుగోలుతో అదానీ పోర్ట్స్‌పై మోతీలాల్ ఓస్వాల్ బుల్లిష్
సూర్య మార్కెట్ డెస్క్, ముంబై: యూరప్‌కు చెందిన ప్రముఖ లిక్విడ్ స్టోరేజ్ టెర్మినల్స్ ఆపరేటర్ 'ఎవోస్ బి.వి.' )ను కొనుగోలు చేయనున్నట్లు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రముఖ దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీపై తన బుల్లిష్ దృక్పథాన్ని మరింత బలోపేతం చేసుకుంది. దాదాపు 2.56 బిలియన్ యూరోల (దాదాపు ₹23,000 కోట్ల పైచిలుకు) ఎంటర్‌ప్రైజ్ విలువతో కుదిరిన ఈ వ్యూహాత్మక డీల్‌తో అంతర్జాతీయ పోర్ట్ మరియు లాజిస్టిక్స్ రంగంలో అదానీ పోర్ట్స్ స్థానం మరింత పటిష్టమైందని పేర్కొంటూ, కంపెనీ షేరుపై తన 'బై' రేటింగ్‌ను పునరుద్ఘాటించింది. అంతేకాకుండా ఒక్కో షేరుకు ₹2,170 లక్ష్య ధరను నిర్దేశించింది.
యూరప్‌లో భారీ లిక్విడ్ స్టోరేజ్ సామర్థ్యం సొంతం
ఈ కొనుగోలు ద్వారా నెదర్లాండ్స్, జర్మనీ, బెల్జియం, స్పెయిన్ వంటి ఐదు ప్రధాన యూరోపియన్ దేశాల్లో ఉన్న 8 కీలకమైన లిక్విడ్ స్టోరేజ్ టెర్మినల్స్ అదానీ పోర్ట్స్ చేతికి రానున్నాయి. దీనివల్ల కంపెనీ అంతర్జాతీయ పోర్ట్‌ఫోలియోకు అదనంగా 6.3 మిలియన్ క్యూబిక్ మీటర్ల లిక్విడ్ స్టోరేజ్ సామర్థ్యం, ఏటా 37 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో నిర్వహణ సామర్థ్యం తోడవుతాయని మోతీలాల్ ఓస్వాల్ విశ్లేషించింది. అంతర్జాతీయ ఇంధన రవాణా మరియు రసాయన నిల్వల రంగంలో కీలక హబ్‌లలో అదానీ పోర్ట్స్ అడుగుపెట్టడం కంపెనీ గ్లోబల్ విస్తరణ లక్ష్యాలకు భారీ ఊతాన్ని ఇస్తుందని పేర్కొంది.
ఆర్థిక దృక్పథం, రెండంకెల రాబడుల అంచనా
కార్యకలాపాల సామర్థ్యం మెరుగుపడటం, స్టోరేజ్ వినియోగం పెరగడం వల్ల రాబోయే రెండు నుంచి మూడేళ్లలో ఎవోస్ వ్యాపారం నుంచి రెండంకెల క్యాపిటల్ ఎంప్లాయ్డ్ రిటర్న్స్ ) సాధించే అవకాశముందని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది. అంతేకాకుండా 2026-2028 ఆర్థిక సంవత్సరాల కాలంలో అదానీ పోర్ట్స్ మొత్తం ఆదాయంలో 17 శాతం, ఎబిట్డాలో 18 శాతం, నికర లాభంలో 21 శాతం వార్షిక సగటు వృద్ధి రేటు నమోదు కావచ్చని మోతీలాల్ ఓస్వాల్ లెక్కగట్టింది. ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన క్యాష్ ఫ్లోస్ కలిగిన మౌలిక వసతుల ఆస్తులను సొంతం చేసుకోవడం ద్వారా దీర్ఘకాలికంగా వాటాదారులకు అదానీ పోర్ట్స్ భారీ సంపదను సృష్టిస్తుందని నివేదిక స్పష్టం చేసింది.