ప్రపంచ గుండె దినోత్సవం వేళ అమలాపురంలో భారీ వాక్‌థాన్: సినీ నటి మెహ్రీన్, ప్రముఖుల సందడి
సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో మంగళవారం ఉదయం కోనసీమ సూర్య గ్లోబల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రెండు కిలోమీటర్ల మేర భారీ వాక్‌థాన్‌ను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. గుండె ఆరోగ్యంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, శారీరక శ్రమ మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాధాన్యతను చాటిచెప్పడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం ఏడు గంటలకు స్థానిక ఎస్కేబీఆర్ కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ నడక స్థానిక గడియారం స్తంభం సెంటర్ వరకు సాగింది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి మెహ్రీన్ కౌర్, మిస్ ఇండియా సృజనా దేవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి నగరవాసులను విశేషంగా అలరించారు. వీరితో పాటు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి, శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, చాంబర్ అధ్యక్షులు బోణం సత్య వరప్రసాద్, జనసేన నాయకురాలు నాగమానస, ప్రముఖ నాయకులు ఆవుపాటి గోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సూర్య గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో పాటు పట్టణ ప్రముఖులు, విద్యార్థులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వాక్‌థాన్‌ను విజయవంతం చేశారు.
వాక్‌థాన్ ముగిసిన అనంతరం సూర్య గ్లోబల్ ఆసుపత్రి ప్రాంగణంలో గుండె సంబంధిత వ్యాధులపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మిస్ ఇండియా సృజనా దేవిని అతిథులు ఘనంగా సత్కరించారు. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల యువతలో కూడా గుండె జబ్బులు పెరుగుతున్నాయని, నిత్యం వ్యాయామం చేస్తూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వక్తలు పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యమై ప్రతి ఒక్కరూ తమ గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని వైద్య నిపుణులు సూచించారు.