విజయమే లక్ష్యంగా పనిచేయాలి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగురవేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు.అనపర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులతో పాటు నాయకులు, కార్యకర్తల సమావేశం అనపర్తిలోని ఎస్‌ఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి, నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, కూటమి నాయకులు హాజరయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై వారు చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమిలోని మూడు పార్టీలు పరస్పర సమన్వయంతో, సమన్యాయంతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే ఐక్యతను కొనసాగిస్తూ 100 శాతం విజయ లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని, క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువవుతూ ఎన్నికల ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. అసెంబ్లీ ఫలితాలతో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిన ప్రభుత్వం, స్థానిక ఎన్నికల ఫలితాలతో త్రిబుల్ ఇంజిన్ సర్కార్ గా ఏర్పడనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో వ్యవహరించాలని, అభ్యర్థుల మధ్య సమిష్టి భావన ఉండాలని పేర్కొన్నారు. వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా కూటమి అభ్యర్థుల విజయమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పార్టీ నాయకత్వం ఇచ్చే సూచనలను పాటిస్తూ, కార్యకర్తలంతా ఒకే తాటిపై నిలవాలని పిలుపునిచ్చారు.గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అనపర్తి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని ఎమ్మెల్యే నల్లమిల్లి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గడిచిన రెండేళ్లలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలితాలను గ్రామస్థాయిలో ప్రజలకు వివరించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
ప్రజల వద్దకు వెళ్లి గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించాలని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వారి నమ్మకాన్ని పొందాలని సూచించారు. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ, అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని కోరారు.
వైఎస్సార్‌సీపీ సరైన అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోందని, అభ్యర్థులను ప్రకటించడంలోనూ వెనుకంజ వేస్తోందని ఎమ్మెల్యే విమర్శించారు. కూటమి శ్రేణులు ఐక్యంగా పనిచేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించడం సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కూటమిపై ఉంచిన విశ్వాసాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ నిలబెట్టుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాలుగు మండలాల్లోనూ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి 100 శాతం విజయాన్ని సాధించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు.ఈ సమావేశంలో కూటమి నాయకులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, వివిధ స్థాయిల పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.