విద్యుత్ షాక్‌తో వ్యక్తికి తీవ్ర గాయాలు.. న్యాయం చేయాలంటూ ఊటుకూరు సబ్‌స్టేషన్ ముట్టడి!
విద్యుత్ షాక్‌తో వ్యక్తికి తీవ్ర గాయాలు.. న్యాయం చేయాలంటూ ఊటుకూరు సబ్‌స్టేషన్ ముట్టడి!
*లైన్‌మెన్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమంటూ గ్రామస్తుల ఆరోపణలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్*
*జోరువానను సైతం లెక్కచేయకుండా సైదాపురం–పొదలకూరు ప్రధాన రహదారిపై రాస్తారోకో.. గంటకు పైగా నిలిచిన వాహనాల రాకపోకలు*
*బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం – సైదాపురం విద్యుత్ శాఖ ఏఈ నాగభూషణ్*
*సైదాపురం, నవంబర్ 26 (మేజర్ న్యూస్):*
నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గిద్దలూరు గ్రామపంచాయతీ పరిధిలోని గోవిందంపల్లికి చెందిన పెరమల గంగయ్య విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విద్యుత్ ప్రమాదంలో గాయపడిన బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అతని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు గురువారం ఊటుకూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేపట్టారు.
వివరాల్లోకి వెళితే.. గోవిందంపల్లికి చెందిన పెరమల గంగయ్య చిన్నచిన్న ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో ఊటుకూరు సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు విద్యుత్ స్తంభం ఎక్కి పని చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం నెల్లూరులోని నారాయణ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితుడి బంధువులు, గ్రామస్తులు ఊటుకూరు సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. అనంతరం సైదాపురం–పొదలకూరు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. జోరువానను సైతం లెక్కచేయకుండా గంటకు పైగా రోడ్డుపైనే కూర్చొని తమ నిరసనను కొనసాగించారు. దీంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
*లైన్‌మెన్ నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆరోపణలు*
విద్యుత్ శాఖకు సంబంధించిన పనుల సమయంలో కొంతమంది లైన్‌మెన్‌లు ప్రైవేటు వ్యక్తులను సహాయకులుగా ఉపయోగించుకుంటూ పనులు చేయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనలోనూ విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా, సరైన ఎల్‌సీ (లైన్ క్లియర్) తీసుకోకుండానే పనులు చేయించడం వల్లే ప్రమాదం జరిగిందని వారు అనుమానం వ్యక్తం చేశారు. బాధితుడితో విద్యుత్ పనులు చేయించిన విషయంలో సంబంధిత లైన్‌మెన్ నిర్లక్ష్యం ఉందని ఆరోపిస్తూ, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాధితుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో అతని కుటుంబానికి తగిన న్యాయం చేయాలని, బాధితుడి వైద్య ఖర్చులు, కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేశారు.
*ఏఈ నాగభూషణ్‌తో గ్రామస్తుల చర్చలు*
ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం గ్రామస్తులు సైదాపురం మండల విద్యుత్ శాఖ ఏఈ నాగభూషణ్‌తో జరిగిన ఘటనకు సంబంధించి చర్చించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను వివరించి, సంబంధిత లైన్‌మెన్ నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిపై ఏఈ నాగభూషణ్ స్పందిస్తూ.. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యం వహించిన వారిపై ఉన్నతాధికారులకు దృష్టికి పూర్తి వివరాలను తీసుకెళ్తామని తెలిపారు. ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం బాధితుడి కుటుంబ పరిస్థితిని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.
అయితే విద్యుత్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పెరమల గంగయ్యకు న్యాయం జరగడంతో పాటు, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు పంచాయతీ గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.