BREAKING
ఆధునిక సాంకేతికతతో విద్యుత్ రంగం, సరికొత్త ప్రగతికి సంకేతం. రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్ కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా, దసరా అడ్వాన్స్ ఇవ్వాలి - రావిపాడు లో జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ బొలిశెట్టి

వేగమే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత

Select Suryaa Now
వేగమే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత

శ్రీకాకుళం, సూర్య :  ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా భారతదేశం 7.8 శాతం వృద్ధిరేటుతో ముందుకు సాగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖపట్నంలోని ఐఐఎంలో బుధవారం నిర్వహించిన 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్లుగా నిరంతరంగా దేశ సేవలో కొనసాగుతున్నారని, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ల ఆలోచనలు, నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందన్నారు. ఈ అభివృద్ధి ప్రయాణంలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.

‘టైమే ఇప్పుడు పెట్టుబడి’ అని పేర్కొన్న కేంద్ర మంత్రి.. పెట్టుబడిదారులకు ప్రాజెక్టులను వేగంగా ప్రారంభించడమే అత్యంత కీలకమన్నారు. ఏపీఐఐసీ సింగిల్ విండో విధానం ద్వారా 6 నుంచి 12 నెలల్లో అనుమతుల ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. దీంతో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారని చెప్పారు.

వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రంలో చోటుచేసుకోబోయే అభివృద్ధిని ముందుగానే అంచనా వేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందిస్తున్నారని అన్నారు. విశాఖపట్నం దేశానికి ‘గేట్‌వే ఆఫ్ ఎకానమీ’గా ఎదుగుతోందని, అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రతిపాదించిన విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ఆలోచన ప్రాధాన్యమైనదని పేర్కొన్నారు.

భోగాపురం విమానాశ్రయం కీలక భాగస్వామి

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కీలక భాగస్వామిగా నిలవనుందని రామ్మోహన్ నాయుడు అన్నారు. కేవలం 31 నెలల్లో విమానాశ్రయ నిర్మాణం పూర్తికావడం, నిర్ణీత గడువుకు ఆరు నెలల ముందుగానే ప్రాజెక్టు పూర్తిచేయడం రాష్ట్రంలో ప్రాజెక్టుల అమలులో ఉన్న వేగానికి నిదర్శనమన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర గౌరవంతో సంబంధాలు మరింత బలపడుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా అభివృద్ధి చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడిగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్రానికి రైల్వే జోన్ రావడం కూడా కీలక పరిణామమని పేర్కొన్నారు.

45 రోజులకు ఒక విమానాశ్రయం ప్రారంభిస్తున్నాం

ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 45 రోజులకు ఒక విమానాశ్రయాన్ని ప్రారంభించుకుంటూ ముందుకు సాగుతున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. విమానాశ్రయాలు కేవలం రవాణా, కనెక్టివిటీకి పరిమితం కాకుండా ఆయా ప్రాంతాలను ఆర్థిక కార్యకలాపాల కేంద్రాలుగా మారుస్తున్నాయని చెప్పారు.

విమానాశ్రయాల అభివృద్ధితో కార్గో, వ్యవసాయం, పర్యాటకం, రవాణా, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాలకు కూడా ఊతం లభిస్తుందని వివరించారు. కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాలకు సైట్ క్లియరెన్స్ లభించడం శుభపరిణామమన్నారు.

విమానయాన రంగానికి అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దే లక్ష్యంతో 5,000 మంది ఏవియేషన్ ప్రొఫెషనల్స్‌ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

ఏపీకి రూ.8.67 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు

గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 216 మెగా ప్రాజెక్టుల ద్వారా రూ.8.67 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2023–24లో 92 మిలియన్ డాలర్ల నుంచి 2025–26లో 608 మిలియన్ డాలర్లకు పెరిగాయని చెప్పారు.

గూగుల్, ఆర్సెలర్ మిట్టల్–నిప్పాన్ స్టీల్, ఎన్‌టీపీసీ, టాటా పవర్, రిలయన్స్ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావడం పెట్టుబడిదారుల్లో ఆంధ్రప్రదేశ్‌పై పెరుగుతున్న ఆసక్తికి సూచికగా పేర్కొన్నారు.

విమానయాన రంగంలో కొత్త అవకాశాలు

కర్నూలులో దేశంలో తొలి డ్రోన్ సిటీ రూపుదిద్దుకుంటోందని, పుట్టపర్తిలో ఏరోస్పేస్, డిఫెన్స్ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. కర్నూలులో రాష్ట్ర తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌టీఓ) ప్రారంభించామని, మరో ఐదు ఎఫ్‌టీఓలు పైప్‌లైన్‌లో ఉన్నాయని చెప్పారు.

కుప్పంలో హంస ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కేంద్రం ఏర్పాటవుతోందని వివరించారు.

‘ఈ దశాబ్దం భారతదేశానిది’

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భారత్ 7.8 శాతం వృద్ధిరేటుతో ముందుకు సాగుతోందని రామ్మోహన్ నాయుడు అన్నారు. సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు.

ప్రపంచ పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన ‘స్వర్ణాంధ్ర’ విజన్‌లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

“ఈ దశాబ్దం భారతదేశానిది. ఇబ్బందులను అవకాశాలుగా మార్చుకుని అద్భుతాలు సృష్టిస్తున్నాం. వేగాన్ని ఎంచుకోండి.. ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకోండి” అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.

అనంతరం వివిధ సంస్థలతో కుదుర్చుకున్న 31 అవగాహన ఒప్పందాలను (ఎంవోయూలను) కేంద్ర మంత్రి సమక్షంలో పరస్పరం మార్చుకున్నారు. ఎగ్జిబిషన్ స్టాళ్లను ప్రారంభించి సందర్శించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎంపీలు మతుకుమిల్లి శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడు, సీఐఐ, ఐఐఎం ప్రతినిధులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లు, పారిశ్రామికవేత్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.