వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:
కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతంలో వన్యప్రాణుల చర్మాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా గుట్టును అటవీశాఖ అధికారులు రట్టు చేశారు. మైదుకూరులోని ఫారెస్ట్ స్పెషల్ టీమ్ నిర్వహించిన దాడుల్లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుల వద్ద నుంచి 5 చర్మాలు, 23 పులి గోర్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న చర్మాలను పరిశీలించగా, అందులో ఒక దుప్పి చర్మం అసలైనదిగా, మిగిలిన పులి చర్మాలు నకిలీవిగా గుర్తించినట్లు తెలిపారు. పులి గోర్లపై కూడా అధికారులు తదుపరి పరిశీలనలు నిర్వహిస్తున్నారు. ఈ అక్రమ రవాణా వ్యవహారానికి కడప పట్టణంతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అధికారులు పేర్కొన్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల ఆధారంగా స్మగ్లింగ్ నెట్‌వర్క్‌పై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి టి. రాజశేఖర్ బాబు, ప్రొద్దుటూరు సబ్ డీఎఫ్ఓ, సంకేత్ సునీల్ గరుడ్ ఐఎఫ్ఎస్, ఎప్ఆర్ఓ హేమాంజలి, నయంఅలి తదితరులు పాల్గొన్నారు.