andhrapradesh
తుఫానుకు దెబ్బతిన్న వరి పొలాలు పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం
నగరం, మేజర్ న్యూస్:
ఆర్నాబ్, మురసు తుఫాను కారణంగా దెబ్బతిన్న వరి పంట పొలాలను రేపల్లె ఇంచార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు, స్థానిక మండల వ్యవసాయాధికారి వేమూరి రమేష్ బాబు నేతృత్వంలో గుంటూరు లాం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ వి. మనోజ్ కుమార్, డాక్టర్ బి. ఆశాజ్యోతి, డాక్టర్ జి. బిందు మాధవి బృందం శుక్రవారం నగరం మండలంలోని వరి పొలాలను సందర్శించారు. పొలంలో నిల్వ ఉన్న వర్షపు నీటిని అంతర కాల్వల ద్వారా బయటికి పంపి, పడిపోయిన దుబ్బులను పైకి లేపి కట్టుకోవాలని రైతులకు తగు జాగ్రత్తలు సూచనలు చేశారు. పిలక దశలో ఉన్న పైరు త్వరగా కోలుకునేందుకు నీరు తీసిన వెంటనే ఎకరాకు 20 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలన్నారు. పూత దశలో ఉన్న పైరుకు ఎండాకు తెగులు ఆశిస్తుందని దీని నివారణకు ప్లాంటోమైసిన్ 1 మి.లీ., కాపర్ హైడ్రాక్సైడ్ 2 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలని, మాగుడు తెగులున్న పైరుకు హెక్సాకోనాజోల్ 400 మీ. లి. లేక ప్రోఫీకోనాజోల్ 200 మీ. లి. ఎకరానికి పిచికారి చేయాలన్నారు. ఆకు ముడత పురుగు ఆశించిన పైరుకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రా. లేక క్లోరాన్ట్రానిప్రోల్ 60 మి.లీ. 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. దోమపోటు, మానిపండు నివారణకు ప్రోపికోనాజోల్ 200 మి.లీ., పైమెట్రోజిన్ 120 గ్రా. లేక ట్రైఫ్ల్యుమెజోపైరం 10 ఎస్ సి 96 మి.లీ. గింజ గట్టిపడే దశలో ఉన్న పైరుకు గింజల్లో మొలక వచ్చే ప్రమాదముందని నీరు తీసిన వెంటనే 50 గ్రా. ఉప్పు లీటరు నీటితో పిచికారి చేసి గింజ మొలకెత్తకుండా ఉండి, రంగు మారడం తగ్గుతుందని వారు తెలిపారు. తొలుత శాస్త్రవేత్తల బృందం క్షేత్ర సందర్శన చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు కె. నాగ శ్రీనివాసరావు, కె. వంశీకృష్ణ, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.