గజపతినగరంలో రోగులు బాధలు
గజపతినగరం, సూర్య : గజపతినగరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు కష్టాలు తప్పడం లేదు. నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాలకు అందుబాటులో ఉండే 100 పడకల ఆసుపత్రిలో కనీస సౌకర్యాల నిర్వహణ, వైద్యుల అందుబాటుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శుక్రవారం ఓపీ కౌంటర్ వద్ద నెట్వర్క్ సమస్య తలెత్తడంతో రోగులు టోకెన్ల కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. నెట్వర్క్ పనిచేయడం లేదని సిబ్బంది చెప్పడంతో రోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు 10 వ నెంబర్ రూమ్ వద్ద కూడా రోగులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఒకే ఒక్క వైద్యులు అందుబాటులో ఉండటంతో రోగులందరికీ వైద్య సేవలు అందించడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది.