గొంతు ఎండుతుంది - త్రాగు నీరు ఇవ్వండి!
బొబ్బిలి, సూర్య : పట్టణంలోని చెరువుగట్టు మహారాణిపేట సింగారపు వీధిలో గత ఆరు రోజులుగా కుళాయిల ద్వారా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి కోసం బిందెలు, క్యాన్లతో పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. కనీస అవసరాలకు కూడా నీరు అందక మహిళలు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
రోజులు గడుస్తున్నా నీటి సమస్య పరిష్కారం కాకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు కనీస మౌలిక సదుపాయమైన తాగునీటిని అందించాలి అని ప్రజలు కోరుకుంటున్నారు.
సంబంధిత మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి, చెరువుగట్టు సింగారపు వీధి, మహారాణి పేట వీధిలో నీటి సరఫరాను పునరుద్ధరించాలి. సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.