స్థానిక సమరానికి ఫలితాల వేళ!
సైదాపురం, మేజర్ న్యూస్ : వెంకటగిరి నియోజకవర్గ రాజకీయాల్లో నేడు అసలైన అగ్నిపరీక్షకు రంగం సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా గ్రామగ్రామాన హోరాహోరీగా సాగిన స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు నేడు ఫలితాల రూపంలో తెరపడనుంది. ప్రచారంలో ఎవరి మాట పైచేయి సాధించింది..? ఓటరు ఎవరికి జైకొట్టాడు..? కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు పలికారా..? లేక వైఎస్సార్‌సీపీకి మరోసారి రాజకీయ అవకాశం కల్పించారా..? అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
స్థానిక సంస్థల ఎన్నికలను ఇరు ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గ్రామస్థాయిలో తమ రాజకీయ పట్టు నిరూపించుకోవాలనే లక్ష్యంతో కూటమి నాయకులు, వైఎస్సార్‌సీపీ నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారాలు, నాయకుల పర్యటనలు, బహిరంగ సమావేశాలు, కార్యకర్తల సమీకరణలతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. మాటల యుద్ధం ఒకవైపు.. ఓటర్ల మద్దతు కూడగట్టుకునే వ్యూహాలు మరోవైపు సాగడంతో పోరు రసవత్తరంగా మారింది.
కూటమికి ప్రభుత్వ బలంపై నమ్మకం.. వైసీపీకి క్యాడర్ బలంపై ధీమా!
వెంకటగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ తమ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నాయకత్వంలో కూటమి శ్రేణులు గ్రామస్థాయిలో తమ బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నించాయి.
మరోవైపు వైఎస్సార్‌సీపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై ప్రజల్లో ఉన్న ఆదరణ, గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది. వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు ఎన్నికల బరిలో గట్టిపోటీ ఇచ్చారు. ముఖ్యంగా గ్రామస్థాయి క్యాడర్‌ను సమన్వయం చేసుకుంటూ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించారు.
సైదాపురం మండలం లో ఆసక్తికర పోరు.. గ్రామాల్లో ఎవరి పట్టు ఎంత?
ముఖ్యంగా సైదాపురం మండలంలో ఎన్నికల పోరు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. వివిధ గ్రామాల్లో అభ్యర్థులు గెలుపు కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నాయకుల వ్యక్తిగత ప్రభావం, గ్రామస్థాయి రాజకీయ సమీకరణాలు ఓటర్ల తీర్పును ప్రభావితం చేసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
జడ్పీటీసీ పీఠం ఎవరిది..? ఎంపీటీసీల్లో మెజారిటీ ఎవరికి?
వెంకటగిరి, సైదాపురం, రాపూరు, కలువాయి, దక్కిలి తదితర మండలాల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోనుందన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. జడ్పీటీసీ స్థానాల నుంచి ఎంపీటీసీ స్థానాల వరకు ఎక్కడ ఎవరి జెండా ఎగురుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఒక్కో గ్రామంలో వెలువడే ఫలితం కూడా ఆయా పార్టీల రాజకీయ బలాబలాలకు కొలమానంగా మారనుంది.
నాయకుల ప్రతిష్టకు పరీక్ష.. కార్యకర్తల కష్టానికి ఫలితం!
ఈ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థల పదవులకే పరిమితం కాకుండా నియోజకవర్గ స్థాయి నాయకత్వానికి కూడా ప్రతిష్టాత్మకంగా మారాయి. నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ ఎంతవరకు తన బలాన్ని నిరూపించుకోనుంది..? ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నాయకత్వంలో కూటమి ఎంతటి ఆధిక్యాన్ని ప్రదర్శించనుంది..? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా మున్సిపాలిటీ ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులను అధిక మెజార్టీతో విజయం సాధించింది అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో ఇరువర్గ మధ్య రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి
ప్రచార సమయంలో ఇరు వర్గాల నాయకులు తమదే విజయమని ధీమా వ్యక్తం చేసినప్పటికీ, తుది నిర్ణయం మాత్రం ఓటరు చేతిలోనే ఉంది. ప్రచార హోరు, నాయకుల అంచనాలు, కార్యకర్తల నమ్మకాలు ఒకవైపు ఉంటే.. ఓటరు ఇచ్చిన తీర్పు మరోవైపు ఉండనుంది.
మొత్తానికి నేడు రాజకీయ లెక్కలు తేలనున్నాయి. ఎవరి అంచనాలు నిజమవుతాయి..? ఎవరి వ్యూహాలు బెడిసికొడతాయి..? ఎవరి నాయకత్వానికి ప్రజామోదం లభిస్తుంది..? అన్నది ఓట్ల లెక్కింపుతో స్పష్టమవుతుంది. కూటమి ఆధిపత్యం చాటుకుంటుందా..? వైఎస్సార్‌సీపీ తన పట్టు నిలబెట్టుకుంటుందా..? అన్న ఉత్కంఠకు నేటి ఫలితాలే సమాధానం చెప్పనున్నాయి. ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు, రాజకీయ నాయకులు, కార్యకర్తల చూపంతా ఫలితాలపైనే!