తుదివిడత సమరానికి సిద్ధం
- తొమ్మిది మండలాల్లో డిసెంబరు 2న పోలింగ్
- నవంబరు 21 నుంచి నామినేషన్ల స్వీకరణ
- అదే రోజు ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి
విజయనగరం బ్యూరో, సూర్య: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తుది ఘట్టానికి తెరలేచింది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికల ప్రక్రియ ముగియగా, చివరిదైన మూడో విడతకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో జిల్లాలోని మిగిలిన తొమ్మిది మండలాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలుకానుంది. డిసెంబరు 2న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ విడతలో విజయనగరం, చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ల పరిధిలోని తొమ్మిది మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. విజయనగరం డివిజన్‌లో భోగాపురం, డెంకాడ, నెల్లిమర్ల, పూసపాటిరేగ, విజయనగరం మండలాలు ఉండగా, చీపురుపల్లి డివిజన్‌లో చీపురుపల్లి, మెరకముడిదాం, గరివిడి, గుర్ల మండలాలు ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు, ఆశావహులు ఎన్నికల కసరత్తును ముమ్మరం చేయనున్నారు.
- 21 నుంచి నామినేషన్ల పర్వం
ఈ నెల 21న ఎన్నికల నోటీసులు జారీ చేయడంతో పాటు వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారు. అదే రోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 23వ తేదీ సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల గడువు ముగుస్తుంది. 24న నామినేషన్ల పరిశీలన చేపడతారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా సంబంధిత ఆర్డీవోకు అప్పీలు చేసుకోవచ్చు. 26న అప్పీళ్లను పరిష్కరిస్తారు.
27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అనంతరం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. - 2న పోలింగ్.. అదే రోజు ఫలితాలు
డిసెంబరు 2న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాలు వెలువడిన రోజే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. అనివార్య కారణాలతో ఆరోజు సాధ్యం కాకపోతే మరుసటి రోజు సెలవు అయినప్పటికీ ఎన్నిక నిర్వహించనున్నారు. - పకడ్బందీ ఏర్పాట్లు
తుదివిడత ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అభ్యర్థులు, ఓటర్లు, రాజకీయ పార్టీలు అధికారులకు సహకరించాలని కోరారు.