తూర్పుగోదావరి జిల్లా కోర్టుకు 222 ఏళ్లు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో, రాజమహేంద్రవరం:తూర్పుగోదావరి జిల్లా న్యాయస్థానం 222 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ 131 ఏళ్ల చారిత్రక ప్రస్థానాన్ని పురస్కరించుకుని శనివారం నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంజీరా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు హాజరయ్యారు.
ఈ వేడుకల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి పాల్గొన్నారు. అలాగే ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్, త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు తదితర ప్రముఖులు హాజరయ్యారు.
కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ న్యాయమూర్తులకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ తదితర అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి జిల్లా కోర్టు 222 ఏళ్లు, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ 131 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించే వేడుకల ప్రత్యేక సావనీర్‌ను ఆవిష్కరించారు.
రెండు శతాబ్దాలకు పైగా న్యాయ సేవలందిస్తున్న తూర్పుగోదావరి జిల్లా న్యాయస్థానం, 131 ఏళ్లుగా న్యాయవాద వృత్తికి సేవలందిస్తున్న రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ చారిత్రక వారసత్వాన్ని ఈ వేడుకలు స్మరించుకున్నాయి. న్యాయ వ్యవస్థలో ఈ సంస్థల సుదీర్ఘ ప్రస్థానం, సేవలు, ఘనతను గుర్తుచేస్తూ కార్యక్రమం నిర్వహించారు.