తిరుపతి, పుంగనూరు, శ్రీకాళహస్తి ఘటనలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు. గవర్నర్ కార్యాలయనికి నివేదిక సమర్పించిన రాష్ట్ర ఎన్నికల సంఘం
తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్
ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం
తిరుపతి, పుంగనూరు, శ్రీకాళహస్తి ఘటనలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు
గవర్నర్ కార్యాలయానికి నివేదిక సమర్పించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా తిరుపతి, పుంగనూరు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో చోటుచేసుకున్న బెదిరింపులు, దాడులు, నామినేషన్ల అడ్డగింతలపై తాను చేసిన ఫిర్యాదుకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తెలిపారు.
ఈ ఘటనలపై అక్టోబర్ 16, 2026న రాష్ట్ర ఎన్నికల సంఘానికి తాను సమర్పించిన ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం, సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేసినట్లు అక్టోబర్ 29, 2026న గవర్నర్ కార్యాలయానికి పంపిన అధికారిక లేఖలో వెల్లడించిందని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా జరిగిన ఘటనలను తీవ్రంగా పరిగణించి, సంబంధిత జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలకు ఫిర్యాదులోని అంశాలను పరిశీలించి, అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిందని తెలిపారు. ఈ మేరకు తీసుకున్న చర్యల వివరాలతో గవర్నర్ కార్యాలయానికి నివేదిక సమర్పించిందని వెల్లడించారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగడం ప్రతి పౌరుడి హక్కు. కానీ నామినేషన్లు వేసే హక్కును అడ్డుకోవడం, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం, దాడులకు పాల్పడటం వంటి ఘటనలు ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ అని ఎంపీ గురుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.
అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తాను మొదటి నుంచీ డిమాండ్ చేస్తున్నానని తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం, గవర్నర్ కార్యాలయానికి నివేదిక సమర్పించడం ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా కీలక పరిణామమని పేర్కొన్నారు. అయితే ఆదేశాలు జారీ చేయడంతోనే బాధ్యత ముగిసిపోదని, క్షేత్రస్థాయిలో వాటి అమలు జరిగేలా చూడాలని, బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో ప్రజల తీర్పే అంతిమమని, బెదిరింపులు, దాడులు, అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవాలని చూసే కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు.