ఓటు హక్కు పరిరక్షణ పోరాటానికి ఢిల్లీకి బషీరాబాద్ కాంగ్రెస్ నాయకులు
బషీరాబాద్, మేజర్ న్యూస్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ఓటు హక్కు పరిరక్షణ (SIR) పోరాటంలో పాల్గొనేందుకు బషీరాబాద్ మండలానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. శనివారం బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకరప్ప, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) మాజీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ ఢిల్లీ పయనమయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని, దాని పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేపట్టిన పోరాటంలో తాము భాగస్వాములవుతున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిరసన వ్యక్తం చేయడంతో పాటు ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు ఢిల్లీలో జరిగే పోరాటంలో బషీరాబాద్ మండలం నుంచి చురుకుగా పాల్గొంటామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు.
రిపోర్టర్: కాశీం పాషా, బషీరాబాద్, వికారాబాద్ జిల్లా.