తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు
సూర్య తిరుమల డెస్క్: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమలలో చిరుత పులి సంచారం మరోసారి కలకలం రేపింది. అలిపిరి నడకమార్గంలో భక్తులకు చిరుత ఎదురుపడటంతో తీవ్ర భయాందోళన నెలకొంది. శ్రీ నరసింహస్వామి ఆలయ సమీపంలో మరియు ఏడో మైలు ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో భక్తులు భయంతో పరుగులు తీశారు.
సోమవారం రాత్రి సమయంలో నడకమార్గంలో వెళ్తున్న భక్తులకు శ్రీ నరసింహస్వామి ఆలయ సమీపంలో చిరుతపులి ప్రత్యక్షమైంది. ఆకస్మాత్తుగా చిరుతను చూసిన భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురై కేకలు వేస్తూ పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన టీటీడీ భద్రతా సిబ్బంది మరియు అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, భక్తులను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అంతేకాకుండా, మంగళవారం ఉదయం కూడా అలిపిరి నడకమార్గంలోని 2800వ మెట్టు వద్ద చిరుత పులి కనిపించడంతో కలకలం మరింత రెట్టియింది. ఏడో మైలు నుంచి నరసింహ స్వామి ఆలయ పరిసరాల వరకు చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు, నడకమార్గంలో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ సిబ్బంది గస్తీని ముమ్మరం చేశారు.