టీటీడీ విద్యాసంస్థల్లో మెరుగైన సదుపాయాలు -రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ -టిటిడి విద్యాసంస్థల నిర్వహణపై ప్రశంసలు
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : తిరుపతిలోని టీటీడీ విద్యాసంస్థల నిర్వహణ తీరుకు రాష్ట్రస్థాయి ప్రశంసలు దక్కాయి. బాలలకు అందిస్తున్న విద్య, సంరక్షణ, సంక్షేమ సదుపాయాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ ఏవీఎస్ సూర్యనారాయణ రాజు సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం కమిషన్, సభ్యుల బృందంతో కలిసి ఆయన తిరుపతిలోని టీటీడీ విద్యాసంస్థలైన శ్రీవేంకటేశ్వర బాలమందిరం, శ్రీపద్మావతి బాలికల ఉన్నత పాఠశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
వంటశాల, స్టోర్‌లో పరిశుభ్రతకు ఫిదా..
ఈ సందర్భంగా శ్రీవేంకటేశ్వర బాలమందిరానికి చేరుకున్న చైర్‌పర్సన్ బృందం ముందుగా వంటశాల, స్టోర్‌ను పరిశీలించింది. పిల్లలకు వండే ఆహార పదార్థాల నిల్వ, వంటశాలలో పాటిస్తున్న పరిశుభ్రత, స్టోర్‌లో రికార్డుల నిర్వహణను ఒక్కొక్కటిగా తనిఖీ చేశారు. వంటశాలలో పరిశుభ్రత, క్రమబద్ధమైన నిర్వహణ, సక్రమమైన రికార్డుల నిర్వహణ చూసి చైర్‌పర్సన్ సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వహణ బాధ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
పిల్లలే దేవుళ్లు...వారి సంరక్షణలో రాజీవద్దు
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ ఏవీఎస్ సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ పిల్లలే దేవుళ్లు అని, వారి సంరక్షణ, భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. బాలల హక్కుల పరిరక్షణ, భద్రత, సమగ్ర సంక్షేమం కోసం టీటీడీ చేపడుతున్న చర్యలు అభినందనీయమని అన్నారు. ప్రతి బాలిక, బాలుడు సురక్షిత వాతావరణంలో ఆరోగ్యకరమైన ఆహారంతో నాణ్యమైన విద్యను పొందాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం శ్రీపద్మావతి బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థినులకు అందిస్తున్న విద్యా, సంరక్షణ, సంక్షేమ సదుపాయాలను పరిశీలించారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యార్థుల హాజరు, భోజన పథకం అమలు తీరుపై ఆరా తీశారు. విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.
టీటీడీ నిర్వహణకు కమిషన్ ప్రశంస.
టీటీడీ విద్యాసంస్థల్లో మెరుగైన సదుపాయాలు, క్రమశిక్షణతో కూడిన నిర్వహణ ఇతర విద్యాసంస్థలకు ఆదర్శంగా నిలుస్తుందని కమిషన్ బృందం అభిప్రాయపడింది. బాలల హక్కుల పరిరక్షణ చట్టాల అమలు, బాలల భద్రతా ప్రమాణాలు పాటించడంలో టీటీడీ ముందుందని పేర్కొంది. భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో సదుపాయాలు కొనసాగించాలని సూచించింది. ఈ పర్యటనలో కమిషన్ సభ్యులు గాంధీ బాబు, జిల్లా బాలల సంరక్షణ అధికారి వి. శివశంకర్, సంరక్షణ అధికారి జె.దేవయాని, టీటీడీ ఏఈవో బి.అమ్ములు, ప్రధానోపాధ్యాయులు పద్మావతమ్మ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్