ఆసియా ర్యాంకింగ్స్ లో వర్సిటీకి ప్రత్యేక గుర్తింపు
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మకమైన క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2027లో మహిళా వర్సిటీ ప్రత్యేక గుర్తింపు లభించింది. దక్షిణాసియా విశ్వవిద్యాలయాల విభాగంలో 452వ ర్యాంకును, ఆసియా స్థాయి మొత్తం ర్యాంకింగ్స్‌లో 1401-1500 ర్యాంకుల బ్యాండ్ లో స్థానం సంపాదించి సత్తా చాటింది.
పరిశోధనా సామర్థ్యం అంతర్జాతీయ గుర్తింపు
క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్ అంటే కేవలం పరీక్షల్లో మార్కులు కాదు. విశ్వవిద్యాలయాల విద్యా ప్రమాణాలు, పరిశోధనా సామర్థ్యం, అధ్యాపకుల నాణ్యత, విద్యార్థి-అధ్యాపక నిష్పత్తి, అంతర్జాతీయ గుర్తింపు, పరిశోధన పత్రాలు, సామాజిక ప్రభావం వంటి ఎన్నో అంశాలను క్షుణ్ణంగా అంచనా వేసి ఈ ర్యాంకులు ఇస్తారు. అలాంటి కఠినమైన ప్రమాణాల్లో పద్మావతి వర్సిటీ చోటు దక్కించుకోవడం గమనార్హం.
మహిళా విద్యకు మణిహారం వర్సిటీ…
ఈ విజయం విశ్వవిద్యాలయం విద్యా ప్రమాణాలు, నాణ్యమైన విద్య, పరిశోధనా కార్యకలాపాలు సంస్థాగత అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందని వారు పేర్కొన్నారు. కేవలం డిగ్రీలు ఇవ్వడమే కాదు, విద్యార్థినులను సమర్థులైన వృత్తి నిపుణులుగా, పరిశోధకులుగా, మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వర్సిటీ పనిచేస్తోందన్నారు. రాబోయే సంవత్సరాల్లో మరింత మెరుగైన ర్యాంకులు సాధించే దిశగా నిరంతరం కృషి చేస్తామని, ఆసియా స్థాయిలో మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజయానికి సహకరించిన అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినులు, పూర్వ విద్యార్థులు ఇతర భాగస్వాములందరికీ ఉపకులపతి, రిజిస్ట్రార్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
వీసీ, రిజిస్టర్లు హర్షం…
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య వి.ఉమ, రిజిస్ట్రార్ ఆచార్య ఆర్.ఉష హర్షం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు వెనుక నిరంతరం కృషి చేసిన ర్యాంకింగ్స్ డైరెక్టర్ ఆచార్య పి.వెంకట కృష్ణ ర్యాంకింగ్స్ విభాగం సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్