ప్రమాణానికి ముందే ప్రజాసేవకు శ్రీకారం 54 డివిజన్ లో వీధి దీపాలు డ్రైనేజీ సమస్యల పరిష్కారం -ప్రజలలో వెలుగులు నింపిన నూతన కార్పొరేటర్ బోయళ్ళ శాంతి
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్
తనను అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 54వ డివిజన్ నూతన కార్పొరేటర్ బోయళ్ళ శాంతి ప్రమాణ స్వీకారానికి ముందే ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. బుధవారం డివిజన్ పరిధిలోని ఆమె విస్తృతంగా పర్యటించారు. స్థానిక మహిళలు, యువతతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వీధిదీపాలతో ప్రజలకు వెలుగులు….
ఈ సందర్భంగా కార్పొరేటర్ బోయళ్ళ శాంతి పర్యటనలో వీధి దీపాలు వెలగక ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు చెప్పుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆమె విద్యుత్ శాఖ అధికారులను సంఘటన స్థలాలకు పిలిపించారు. డివిజన్‌లో ఎక్కడా వీధి దీపం పనిచేయకుండా ఉండకూడదు అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చెడిపోయిన వీధి దీపాలను తక్షణమే మరమ్మతు చేసి అన్ని ప్రాంతాల్లో వెలుగులు నింపేలా చర్యలు చేపట్టారు. అంతేకాకుండా డివిజన్‌లోని మురికి కాలువలు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లీకేజీలు, పారిశుద్ధ్య సమస్యలను పరిశీలించి సంబంధిత సిబ్బందితో వెంటనే శుభ్రపరిచే పనులు చేపట్టించారు. ప్రజారోగ్యానికి ఇబ్బంది కలిగించే సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా స్థానిక మహిళలను ఆప్యాయంగా పలకరించిన కార్పొరేటర్ బోయళ్ళ శాంతి, తనపై విశ్వాసం ఉంచి ఘన విజయాన్ని అందించిన ప్రతి ఓటరుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని, ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, ప్రమీలమ్మ, మంజులమ్మ, రాధా, శకుంతలమ్మ, రెడ్డి శేఖర్ పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్