స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్స్
ఒకే దశలో పురపాలక ఎన్నికలు - రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై పరిశీలన - 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు - వివరాలు వెల్లడించిన ఏపీ ఎన్నికల కమిషనర్ - అనిల్ చంద్ర
నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ : గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలునిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఒక దశలోనే నిర్వహించనున్నారు.ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిలచంద్ర పునేఠా తెలిపారు.
నోటిఫికేషన్ విడుదల చేసిన సమయం నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి
నోటిఫికేషన్ వెలువడిన 14 రోజుల్లోనే పంచాయితీ ఎన్నికలు.. అదే రోజు ఫలితాలు
15 రోజుల్లో పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికలు. రెండు రోజుల్లో ఓట్ల లెక్కింపు ఫలితాలు
16 రోజుల్లో MPTC,జడ్పీటీసీ ఎన్నికలు.. రెండు రోజుల తర్వాత ఫలితాలు
పంచాయతీలకు మాత్రం పార్టీ రహితంగా ఎన్నికలు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి 14 రోజుల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై ఒంటి గంటకు ముగియనుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికలు నోటిఫికేషన్ నుంచి 15 రోజుల్లో, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 16 రోజుల్లో పూర్తి చేయనున్నారు. పోలింగ్ పూర్తయిన రెండు రోజుల తరువాత వీటిలో ఓట్లు లెక్కించనున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా.. మిగిలినవన్నీ పార్టీ పరంగా నిర్వహిస్తారు. నోటిఫికేషన్, ఎన్నికల షెడ్యూల్ ఏది ముందు వెలువడితే.. అదే రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఎన్నికలకు మొత్తం 1,05,432 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. తెలంగాణ నుంచి 17,650 బాక్సులు తెప్పించారు.
ఎన్నికల నిర్వహణకు సిద్ధం: ఎస్ఈసీ
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఎస్ఈసీ విలేకర్లతో మాట్లాడారు. 'అన్ని జిల్లాల్లోనూ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్స్లు, మెటీరియల్ సిద్ధం చేశాం. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించాలన్న సూచనలు పరిశీలించి నిర్ణయాన్ని వెల్లడిస్తాం' అని వివరించారు..