స్థానిక ఎన్నికల్లోనూ టీడీపీ జెండా ఎగరాలి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
పర్చూరు:
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, నియోజకవర్గ అభివృద్ధిపై నిరంతరం దృష్టి సారిస్తున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వంటి నాయకుడు దొరకడం పర్చూరు ప్రజల అదృష్టమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఎప్పుడూ నియోజకవర్గంలోనే..:
ఎమ్మెల్యే ఏలూరి ఎప్పుడు చూసినా నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలకు సేవ చేయాలనే తపనతో పనిచేస్తున్నారని మంత్రి జనార్దన్ రెడ్డి కొనియాడారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఆయనదన్నారు. ప్రజలు, కార్యకర్తలు ఏ సమయంలో ఫోన్ చేసినా స్పందించే నాయకులు అరుదుగా ఉంటారని పేర్కొన్నారు.
అభివృద్ధిపై నిరంతర చర్చ:
తాను విజయవాడలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఏలూరి వారానికి ఒకసారైనా తనను కలిసి నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చిస్తుంటారని బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఆర్‌అండ్‌బీ శాఖకు సంబంధించిన పనులపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ, నిధుల మంజూరుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా పర్చూరు నియోజకవర్గానికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
కార్యకర్తల కష్టంతోనే విజయం:
టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని పనిచేశారని మంత్రి అన్నారు. కార్యకర్తల శ్రమతోనే తామంతా ఈ స్థాయిలో ఉన్నామని పేర్కొన్నారు.
స్థానిక ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించాలి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ ఆశీస్సులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని మండలాల్లో టీడీపీ ఘన విజయం సాధించేలా కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.