సృజనాత్మక ఆలోచనలను అంకుర సంస్థలుగా మలుచుకోవాలి ఏపీ నిట్ డిజిగ్నేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె. వెంకట కృష్ణారావు
తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలను విద్యా ప్రాజెక్టులకే పరిమితం చేయకుండా, సమాజానికి ఉపయోగపడే అంకుర సంస్థలుగా మలచుకోవాలని ఏపీ నిట్ డిజిగ్నేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె. వెంకట కృష్ణారావు సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి వినూత్న పరిష్కారాలను రూపొందించడంతోపాటు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఆలోచనలను అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. ఏపీ నిట్‌లోని సంస్థాగత ఆవిష్కరణ మండలి (ఐఐసీ), రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (రాజమహేంద్రవరం ,ఆర్‌టీఐహెచ్) సంయుక్త ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించనున్న స్పార్క్–ఫ్యూచర్ ఫౌండర్స్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం బృందావనం భవన్‌లో ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కె. వెంకట కృష్ణారావు మాట్లాడుతూ వైఫల్యాలను ఎదురుదెబ్బలుగా భావించకుండా, వాటి నుంచి పాఠాలు నేర్చుకుని పట్టుదలతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. రిజిస్ట్రార్ డాక్టర్ పి. దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను వెలికితీసి, వారి ఆలోచనలకు ప్రోత్సాహం అందించేలా విద్యాసంస్థలో అనుకూలమైన ఆవిష్కరణల వాతావరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ఐఐసీ అధ్యక్షుడు డాక్టర్ వి. సందీప్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆవిష్కరణ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంస్కృతిని పెంపొందించేందుకు ఐఐసీ నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. విద్యార్థుల ఆలోచనలకు సరైన వేదిక, మార్గదర్శకత్వం, అవసరమైన సహకారం అందించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ‘స్పార్క్’ ప్రధాన లక్ష్యమని వివరించారు. ఆర్‌టీఐహెచ్ రాజమండ్రి ఇన్నోవేషన్ అండ్ ఇన్‌క్యుబేషన్ హెడ్ డాక్టర్ చంద్ర ప్రకాశ్,ఐఐసీ సమన్వయకర్త డాక్టర్ టి. కార్తికేయ శర్మ పలువురు మాట్లాడారు. యువ ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు నిట్ ఆంధ్రప్రదేశ్ ఐఐసీ ఇప్పటికే పది ఆలోచనలకు ఇగ్నిషన్ గ్రాంట్లు అందించిందన్నారు. రెండో దశ ఇగ్నిషన్ గ్రాంట్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ప్రస్తుతం మూడు అంకుర సంస్థలకు మద్దతు అందిస్తున్నామని తెలిపారు. అనంతరం ప్రొఫెసర్ వెంకట కృష్ణారావును ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమం లో డీన్ స్టూడెండ్స్ వెల్ఫేర్ డాక్టర్ హిమబిందు, ఆచార్యులు డాక్టర్ శ్రీఫణి కృష్ణ కర్రి, డాక్టర్ టి. కిరణ్, డాక్టర్ తపస్, డాక్టర్ సుదర్శన్ దువాతో పాటు నిట్, కైట్, బీవీసీ, పలు ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ తాడేపల్లిగూడెం