శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలఘనాథస్వామి దేవస్థానంలో ఘనంగా కార్తీక దీపోత్సవం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలఘనాథస్వామి దేవస్థానంలో మంగళవారం రాత్రి నిర్వహించిన కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో దీపారాధనలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఈ దీపోత్సవానికి భక్తుల సంఖ్య పెరుగుతూ, ఆత్మకూరు పట్టణంలో ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక కార్యక్రమంగా గుర్తింపు పొందుతోంది. భక్తులు స్వచ్ఛందంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం విశేషం. కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ ఉభయదాతలు తీర్థప్రసాదాలు అందజేశారు. మహిళలు స్వయంగా కార్తీక దీపాలను వెలిగించి దీపారాధన చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా వ్యవహరించిన డాక్టర్ పలక గుణశేఖర్ , డాక్టర్ శ్రీలక్ష్మి దంపతులకు, కార్యక్రమ నిర్వాహకులైన పల్లంరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, అనసూయమ్మ దంపతులకు దేవస్థానం తరఫున కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.