శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో వైభవంగా కాత్యాయని వ్రతం
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ : నెల్లూరు దుర్గామిట్టలో వేంచేసియున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం కాత్యాయని వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనివెట్టి మండపంలో అమ్మవారికి వివిధ రకాల నయన మనోహరమైన పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం స్త్రీలు సౌభాగ్యం, ఆయురారోగ్యాలు, అన్యోన్య దాంపత్యం కలగాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలతో కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు. ఈ వ్రతాన్ని నిష్ఠతో ఆచరిస్తే ఉత్తమ ఫలితాలు లభిస్తాయని విశ్వసిస్తారు.ఈ విశేష పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఛైర్మన్ ఏలూరు శిరీష, ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి నూతలపాటి శ్రీధర్ నాయుడు, పాలక మండలి సభ్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ ఘనంగా నిర్వహించారు.