శెట్టిపాలెంలో ఇంటిగ్రేటెడ్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌కు శంకుస్థాపన
నర్సీపట్నాన్ని పరిశ్రమల హబ్‌గా మారుస్తాం
శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం, అక్టోబర్ 13 మేజర్ న్యూస్: జిల్లాలో మాకవరపాలెం మండలం, సెట్టిపాలెం గ్రామంలో నూతన కాఫీ పొడి శుద్ధి కర్మాగారం పనులకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శిశు మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ మంగళవారం ఉదయం శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.*
ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ....... నర్సీపట్నం నియోజకవర్గాన్ని పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దడమే తన సంకల్పమని స్పష్టం చేశారు. అరకులో లభ్యమయ్యే ఉత్పత్తులకు లండన్ ఎయిర్ పోర్ట్ వంటి చోట్ల ఎంతో ఆదరణ ఉన్నప్పటికీ మనం నిర్లక్ష్యం చేస్తున్నామని, ఇక్కడ శుద్ధి చేసిన కాఫీ పౌడర్‌ను ప్రపంచవ్యాప్తంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విశాఖపట్నం గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో 11.08 ఎకరాల విస్తీర్ణంలో, 16 కోట్లతో ఈ ఇంటిగ్రేటెడ్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టులో కాఫీ క్యూరింగ్, రోస్టింగ్, బ్లెండింగ్ సదుపాయాలు ఉంటాయని, గంటకు 4 టన్నుల కాఫీ క్యూరింగ్, గంటకు 100 కిలోల రోస్టెడ్, బ్లెండెడ్ కాఫీ ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉంటుందని వివరించారు.
సంవత్సరానికి సుమారు 3 వేల మెట్రిక్ టన్నుల కాఫీ గింజలు, 100 మెట్రిక్ టన్నుల రోస్టెడ్ అండ్ బ్లెండెడ్ కాఫీ ఉత్పత్తి చేయాలనేది టార్గెట్ అని పేర్కొన్నారు. ఈ యూనిట్ ద్వారా గిరిజన రైతులు పండించే అరకు వ్యాలీ కాఫీ బ్రాండ్ మార్కెట్‌ను దేశవిదేశాల్లో విస్తరించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి 2027 నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలన్నది లక్ష్యమన్నారు. ఈ కర్మాగారం ఏర్పాటులో సుమారు 600 మందికి మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఇదే పరిశ్రమలో అవకాశం కల్పిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. రవాణా సదుపాయాల మెరుగుదల కోసం రాచపల్లి నుంచి ఎలమంచిలి వరకు వంద అడుగుల రోడ్డును ఏర్పాటు చేస్తున్నామని, దీనివల్ల చుట్టుపక్కల భూముల ధరలు పెరుగుతాయన్నారు. రాచపల్లిలో మరో పరిశ్రమ కోసం 426 ఎకరాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అభివృద్ధి పనుల నిమిత్తం మాకవరపాలెం మండలానికి 124 కోట్ల గ్రాంట్ ఇచ్చామని, నియోజకవర్గంలో సుమారు 575 కోట్లు ఖర్చు చేశామని ఆయన వివరించారు. ఎన్టీఆర్ హయాంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి జరిగిందని, పాడేరులో పాలిటెక్నిక్, ఐటిఐ కళాశాలలు అప్పట్లోనే ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టుకు సహకరించిన గిరిజన సహకార సంస్థ అధికారులకు, భూములు ఇచ్చిన రైతులకు, సంబంధిత శాఖల ప్రతినిధులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
శిశు మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ........ ఉత్తరాంధ్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే అయ్యన్నపాత్రుడిని గత ప్రభుత్వం అనేక కేసులతో ఇబ్బంది పెట్టిందని, కాఫీ కర్మాగారం ఏర్పాటుకు సహకరించిన సీఎం చంద్రబాబుకు, స్థానికంగా స్థలంతో పాటు ఇతర సౌకర్యాలు సమకూర్చిన అయ్యన్నపాత్రుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ సహకారంతో గిరిజన ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పిస్తున్నామని, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చంద్రబాబు కల్పించారని పేర్కొన్నారు.
జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ....... ఈ కర్మాగారం ఏర్పాటు వెనుక చాలా కృషి ఉందని, ఏజెన్సీ వాతావరణం అనుకూలించనందున మైదాన ప్రాంతమైన నర్సీపట్నంలో రవాణాకు అనుకూలంగా ఉంటుందని భావించి పది కోట్ల వ్యయంతో ఈ శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ...... సకాలంలో కర్మాగారం పూర్తయ్యేలా జీసీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని, స్థానికులకు ఉపాధి కల్పించాలని సూచించారు.
జీసీసీ ఎండీ శోభిత మాట్లాడుతూ...... అరకు కాఫీ రాష్ట్రానికే గర్వకారణమని మార్కెట్ అవకాశాలు మెరుగుపరచడానికి, కాఫీ ఉత్పత్తుల విలువను హెచ్చించడానికి ఈ కర్మాగారం తోడ్పడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్య బాబు, ఏపీ స్టేట్ గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర, టీడీపీ పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్, జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ సూర్యచంద్ర, సెట్టిపాలెం మాజీ సర్పంచ్ అల్లు రామనాయుడు, నందకిషోర్ , ప్రజలు తదితరులు పాల్గొన్నారు.