సరుబుజ్జిలి జడ్పిటిసి అభ్యర్థిగా సింగుపురపు దివ్య
ఆమదాలవలస, అక్టోబర్ 27, మేజర్ న్యూస్ ;సరుబుజ్జిలి మండలం కూటమి బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున సింగుపురపు దివ్య ఎన్నికల బరిలో నిలిచారు. కూటమి పొత్తులో భాగంగా సరుబుజ్జిలి మండలం జడ్పిటిసిని జనసేనకు కేటాయించడంతో క్యాడర్ అంతా అభ్యర్థి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా సమష్టిగా కృషి చేయాలని జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ పిలుపునిచ్చారు. ఈ పరిణామం కూటమి ఐక్యతకు, పరస్పర సమన్వయానికి నిదర్శనంగా నిలుస్తోంది. సింగుపురపు దివ్య విద్యార్హతలు కలిగి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. విద్యారంగంలో తన అనుభవాన్ని, ప్రజల పట్ల సేవాభావాన్ని ప్రజాసేవకు ఉపయోగించాలనే సంకల్పంతో జడ్పీటీసీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ భాగస్వామ్య పార్టీల నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజల్లోకి వెళ్లాలి. కూటమి లక్ష్యాలను, ప్రజాసేవా సంకల్పాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.