సఫాయి మిత్ర సురక్షా శిభిరం
స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా జాతీయ సంస్కృత వర్సిటీలో బుధవారం సఫాయి మిత్ర సురక్షా ఏవం సమ్మాన్ శిభిరాన్ని నిర్వహించారు. విశ్వవిద్యాలయానికి చెందిన పారిశుద్ధ్య, ఉద్యానవన సిబ్బంది, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన సఫాయి మిత్రుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. విధి నిర్వహణలో సఫాయి మిత్రులు పాటించాల్సిన పని ప్రదేశ భద్రతా చర్యలు, వ్యక్తిగత రక్షణ, ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణ చర్యలు తదితర అంశాలపై ఈ శిబిరంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి స్విమ్స్ మెడిసన్ విభాగాధిపతి డాక్టర్ అల్లాడి మోహన్ ముఖ్యఅతిథి హాజరై విధి నిర్వహణ సమయంలో పారిశుద్ధ్య, ఉద్యానవన సిబ్బంది పాటించాల్సిన ముఖ్యమైన ఆరోగ్య, భద్రతా చర్యలను ఆయన వివరించారు. స్వచ్ఛతా హి సేవా నోడల్ అధికారి డాక్టర్ కనపాల కుమార్ మాట్లాడుతూ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సఫాయి మిత్రలు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. సఫాయి మిత్రల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పని ప్రదేశంలో తగిన రక్షణ చర్యలు పాటించడం, ముందస్తు ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం 100మంది సఫాయి మిత్రలకు సఫాయి మిత్ర సమ్మాన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, డీన్ ఆఫ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ ప్రొఫెసర్ ఎస్ దక్షిణామూర్తి శర్మ, అధ్యాపకులు, సపాయి కార్మికులు పాల్గొన్నారు