సబ్సిడీ రుణాలు అందడం ఇక గగనమేనా ,గత ప్రభుత్వంలోనూ ఇదే తంతు రద్దు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ :ఆత్మకూరు మున్సిపాలిటీలో, ఆత్మకూరు మండలంలో వెలుగుబడిన తరగతుల సంక్షేమ శాఖ,ఇతర కార్పొరేషన్ ల ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వారి జీవనోపాధి కోసం సబ్సిడీతో రుణాల మంజూరు చేసేలా ప్రభుత్వం నిర్ణయించగా అనేక మంది దరఖాస్తులు చేసుకోగా ప్రభుత్వం నుండి సబ్సిడీ విడుదల కానందున ఎంపికైన వారికి ఈనాటికి రుణాలు అందలేదు.
ప్రభుత్వం నుండి సబ్సిడీలు విడుదలవుతాయా లేక రుణాలు రద్దు అవుతాయా అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా వివిధ కార్పోరేషన్ల నుండి సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు స్వీకరించి ఇంటర్వ్యూలు నిర్వహించి ఆ రుణాల పథకాన్ని రద్దు చేశారు. కాగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక గత జనవరి లో ఈ పధకానికి శ్రీకారం చుట్టారు.యువతీ యువకులు ఆన్లైన్లో అన్ని ధ్రువీకరణలతో దరఖాస్తుల చేయగా వారికి ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు,ప్రభుత్వ ఇచ్చిన కార్పొరేషన్ వారిగా లక్ష్యం మేరకు ఈ దరఖాస్తుదారుల నుండి ఎంపిక చేసి ఆయా బ్యాంకులకు పంపారు. అయితే ప్రభుత్వం నుండి బ్యాంకులకు సబ్సిడీ విడుదల కాలేదని దాంతో బ్యాంకర్లు రుణాలు లబ్ధిదారులకు మంజూరు చేయలేదని చెబుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రుణం మొత్తం 50శాతం సబ్సిడీగా విడుదల చేయాల్సి ఉంది. కానీ ఏడాది దాటిన ఇంకా ప్రభుత్వం నుండి బ్యాంకులకు సబ్సిడీ నిధులు విడుదల కాలేదు
ఆత్మకూరు మండలంలో 46 మందికి 50శాతం సబ్సిడీతో బ్యాంకు లో నుండి రుణాలు పొందేందుకు ప్రభుత్వ లక్ష్యంగా నిర్ణయించి ఆదేశాలివ్వగా అధికారులు దరఖాస్తులు సేకరించి ఇంటర్వ్యూలు నిర్వహించి ఆర్హులను ఎంపిక చేశారు. ఆత్మకూరు మండలంలో మూడు రకాలుగా రెండు లక్షల నుండి 5 లక్షల వరకు ఈ రుణాలు ఉంటాయని బీసీ కార్పొరేషన్ ద్వారా 30 మందికి, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి, రెడ్డి కార్పొరేషన్ ద్వారా ముగ్గురికి,ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా ఇద్దరికీ, కమ్మ కార్పొరేషన్ ద్వారా ఇద్దరికీ,ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి, చంద్రన్న స్వయం ఉపాధి పథకం ద్వారా కాపులు 5 మందికి, మరియు జనరిక్ మందుల షాపు ఏర్పాటుకు కమ్మ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి, ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా ఒకరికి సబ్సిడీతో బ్యాంకు నుండి రుణాలు మంజూరు అవుతాయని ప్రభుత్వం నుండి ఆదేశాలున్నాయి.
ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో బీసీ కార్పొరేషన్ ద్వారా 41 మందికి, కాపు కార్పొరేషన్ ద్వారా నలుగురికి, ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా ఒకరికి, క్షత్రియ కార్పొరేషన్ ద్వారా ఒకరికి మొత్తం 47 మందికి రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించారు.ఆ మేరకు మండలంలో ఎంపిడిఓ, మున్సిపాలిటీలో కమీషనర్లు అన్ని బ్యాంకులు ప్రతినిధులతో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేసి ఆయా బ్యాంకులకు వారి దరఖాస్తులను పంపారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు సబ్సిడీ విడుదల చేయనందున నెలలు తరబడి జాప్యం జరుగుతుండగా రుణాలు ఎంపికైన వారు ఆత్రుతగా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంకా జాప్యం జరుగుతుందా లేదా గతంలో లాగా రద్దు అవుతాయా అని వారంతా చర్చించుకుంటున్నారు. గతంలో తెలుగుదేశం హయాంలో ఇలాగే కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు దరఖాస్తులు నిర్వహించి లబ్ధిదారులు ఎంపిక చేయగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆ రుణాలన్నింటిని రద్దు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో ఈసారి అందరూ ఆశించారు. కానీ ఇప్పటివరకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేనందున అందరూ ఈ రుణాలను వెంటనే ఇవ్వాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.