మౌలిక సదుపాయాల అభివృద్ధికి శ్రీకారం
మౌలిక సదుపాయాల అభివృద్ధికి శ్రీకారం
కొత్తపేట,మేజర్ న్యూస్:గ్రామాల అభివృద్ధే దేశ ప్రగతికి పునాదని చాటిచెప్పిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొత్తపేట ఎమ్యెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు.గాంధీ జయంతిని పురస్కరించుకుని పల్లె పండుగ 3.0లో భాగంగా కొత్తపేటలో సుమారు రూ.4 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండారు శుక్రవారం శంకుస్థాపనలు చేశారు.పూర్తయిన కొన్ని పనులను ప్రారంభించారు.కొత్తపేట పంచాయతీ పరిధిలో రోడ్లు,డ్రెయిన్లు,వైద్య సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఎంపీడీవో కార్యాలయం నుంచి వాడపాలెం రహదారి,గణేష్ కాలనీ రోడ్డు అభివృద్ధికి రూ.55 లక్షలు,భవానీ కాలనీలో రోడ్డు,డ్రెయిన్ నిర్మాణానికి రూ.20 లక్షలు కేటాయించారు.పాత రామాలయం పరిధిలో రోడ్ల అభివృద్ధికి రూ.38 లక్షలు,విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి రూ.55 లక్షలు,కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆధునీకరణకు రూ.10 లక్షలు ప్రతిపాదించారు.ఇతర కాలనీలు,వీధుల్లోనూ రోడ్లు,డ్రెయిన్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తూ నియోజకవర్గాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తామని,చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కృషిచేస్తుందని ఎమ్యెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమికి నాయకులు,స్థానికులు తదితరులు పాల్గొన్నారు.