రుషింగి దుర్గా దేవి ఆలయంలో మహిళలు భక్తిశ్రద్ధలతోకుంకుమ పూజలు
వంగర అక్టోబర్, సూర్య : వంగర మండలం రుసింగి. గ్రామంలో వెలసి ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో గురువారం కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల వేళ మరియు ప్రత్యేక పర్వదినాల సందర్భంగా ఆలయం అమ్మవారి నామస్మరణతో మార్మోగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో మహిళలు, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని, విశేష పూజలు నిర్వహించారు. కుంకుమ పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు వేదమంత్రాల నడుమ అమ్మవారికి విశేష అలంకరణలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం
భక్తిభావంతో సామూహికంగా లలితా సహస్రనామ పారాయణ చేస్తూ అమ్మవారికి కుంకుమ అర్చనలు సమర్పించారు. కుటుంబ సభ్యుల సుఖశాంతులు, ఆయురారోగ్యాల కోసం భక్తులు భగవతిని వేడుకున్నారు.
ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు మాట్లాడుతూ, రుసింగి దుర్గాదేవి సన్నిధిలో పూజలు చేయడం ఎంతో మనశ్శాంతిని ఇస్తుందని, అమ్మవారి కృపతో గ్రామం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. పూజా కార్యక్రమం ముగిసిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, కుంకుమ ప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు.
రిపోర్టర్ : దుర్గా ప్రసాద్, వంగర, విజయనగరం జిల్లా.