రూ.10 కోట్ల మత్స్య సంపదను దోచుకుంటున్న చేపల మాఫియాపై చర్యలు తీసుకోవాలి
నెల్లూరు కలెక్టరేట్ మేజర్ న్యూస్ : అల్లూరు,సింగపేట గిరిజన మత్స్యకారులకు న్యాయం చేయాలి
నెల్లూరు: అల్లూరు, సింగపేట చెరువుల పరిధిలో గిరిజన మత్స్యకారుల హక్కులను అడ్డుకుంటూ, సుమారు రూ.10 కోట్ల విలువైన మత్స్య సంపదను అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని యానాదుల సంక్షేమ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు కలెక్టర్ నిర్వహించిన గ్రీవెన్స్‌లో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ, అల్లూరు, సింగపేట చెరువుల సొసైటీల్లో సభ్యులుగా ఉన్న గిరిజన మత్స్యకారులను చేపలు పట్టకుండా కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సభ్యులను బెదిరిస్తూ చెరువుల్లోకి దిగనివ్వకుండా మత్స్య సంపదను ఇతరులు సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల్లో చేపలు పట్టే హక్కు సంబంధిత సొసైటీల సభ్యులైన గిరిజన మత్స్యకారులకు ఉందని, అయినప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరిస్తుందని ఆశించామని, ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని అన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, గిరిజన మత్స్యకారుల హక్కులను కాపాడాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరివీధి సతీష్ చంద్ర, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మానికల మురళి, మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉష, చల్లంచర్ల తిరుపతమ్మ, అల్లూరు మండల నాయకుడు దాసరి అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.